పేదల గుడిసెలు కూల్చారు!
- రోడ్డున పడ్డ 350 కుటుంబాలు
- 200 మంది పోలీసుల బందోబస్తుతో తొలగింపు
- అడ్డుకోబోయిన సీపీఐ నాయకుల అరెస్టు
- హనుమకొండలోని గుండ్ల సింగారంలో ఘటన
- బాధితులను పరామర్శించిన సీపీఐ కార్యదర్శి కూనంనేని
హనుమకొండ (మహబూబాబాద్), జూన్ 20 (విజయక్రాంతి): హనుమకొండ నగర పరిధిలోని గుండ్ల సింగారంలో ఐదేళ్లుగా పేదలు నివాసం ఉంటున్న గుడిసెలను శనివారం ఉదయం పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా తొలగించారు. ఉదయం 5 గంటలకు హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సుమారు 200 మంది పోలీసుల బందోబస్తుతో ఐదు జేసీబీలతో సుమారు 350 గుడిసెలను నేలమట్టం చేశారు.
సీపీఐ నాయకులు అక్కడికి చేరుకొని, గుడిసె వాసులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేయగా తమకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని అడ్డుకుంటే లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారని వాపోయారు. అడ్డుకోబోయిన సిపిఐ నాయకులను, కార్యకర్తలను నిర్బంధించి అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ అయినవారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, నాయకులు పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, మాలోత్ మంగ, బాలాజీ రంజిత్ లతో పాటు 40 మంది ఉన్నారు. కాగా గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి జీవిస్తున్నామని తమను ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోవాలని గుడిసె వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
గుడిసెలు తొలగించిన ప్రాంతంలో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు ఎండలోనే తాత్కాలికంగా ఉంటూ అక్కడే వంటలు చేసుకుంటున్నాయి. చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తమ గుడిసెలను కూల్చి వేసినా తాము ఆ భూమి వదలబోమని స్పష్టం చేశారు. గుండ్ల సింగారంలో పేదల ఇండ్లను, గుడిసెలను ప్రభుత్వం తొలగించిన ఘటన తెలుసుకున్న ఆయన హుటాహుటిన హనుమకొండకు వచ్చి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అనేక మంది పేదలు తమ కన్నీటి గోడును ఆయన ముందు వినిపించారు.
గుడిసెలను తొలగించడం దుర్మార్గం
అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు చేయాల్సింది పోయి నిలువ నీడ లేకుండా పేదలను అక్కడ నుంచి బలవంతంగా ఖాళీ చేయించడం, నిరుపేదల గుడిసెలు తొలగించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలోకి తొక్కింది. గుండ్ల సింగారంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటాం.
భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా స్పందించని అధికార యంత్రాంగం, నిలువ నీడలేని పేదలు 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే నిర్ధాక్షిణ్యంగా తొలగించడం సరైంది కారు. ఈ సంఘటనపై హైదరాబాదులోని సిపిఐ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. భవిష్యత్తులో భూ సమస్యలపై ముందుకు సాగుతాం.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు
మమ్మల్ని చంపినా కదలం
ఐదేళ్లుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. పిల్లలు ఇక్కడి నుంచే బడికి వెళ్తున్నారు. నిన్న అధికారులు ఇక్కడికి వచ్చినప్పటికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఉదయం 4 గంటలకే వచ్చారు. పిల్లలు ఉన్నారని చెప్పినా వినిపించుకోలేదు. మహిళలం అని చూడకుండా నెట్టేశారు. ఇంట్లో ఉండగానే రేకులు కూలగొట్టారు. మమ్మల్ని ఇక్కడే చంపండి.. కదిలేదు లేదు.
రమ బాధితురాలు






