కాలర్ పట్టుకోండి
- మొత్తం ధాన్యం కొనేదాక కాంగ్రెస్‌పై ఉద్యమం
- రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
- కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబానికి పరామర్శ
- బీఆర్‌ఎస్ తరఫున రూ.3 లక్షల చెక్కు అందజేత
ఆదిలాబాద్/ఉట్నూర్/బోథ్, జూన్ 20 (విజయక్రాంతి): పండించిన పంటలు కొనుగోలు చేయాలని కాంగ్రె స్ నేతల కాళ్లు పట్టుకోవద్దని, వారి కాలర్ పట్టుకోవాలని రైతులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనేదాకా కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ తరఫున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారం కోల్పోతూ వస్తోందని.. రాష్ట్రంలో సైతం ఆ పార్టీ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అయ్యే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
జొన్న పంట కొనుగోలు చేయకపోవడంతో మనస్థాపం చెంది ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ కుటుంబాన్ని శనివారం కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ తరఫున మూడు లక్షల రూపాయల చెక్కును అందజేసి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. అలాగే నేరడిగొండలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధ్యక్షతన జరిగిన ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడంతోనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. పాండురంగ 35 క్వింటాళ్ల జొన్నలను మార్కెట్‌లో విక్రయించేందుకు తీసుకువెళ్లి 15 రోజులపాటు వేచి చూడటంతో పాటు తూకం వేసిన జొన్న పంటను తరలించేందుకు క్వింటాలుకు రూ.350 చొప్పున లంచం అడిగారని ఆరోపించారు.
చేతిలో డబ్బులు లేక పురుగుల మందుతాగి పాండురంగా ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తున్నామంటూనే మరోపక్క లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పాండురాంగ కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండించిన పంటలు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ నేతల కాళ్లు పట్టుకోవద్దని, అవసరమైతే వారి కాలర్ పట్టుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుబంధు ప్రభుత్వం పోయి ప్రస్తుతం రాబందుల ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు.
యూరియా యాప్‌తో ఇబ్బందులు
చేతకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతాంగాన్ని నిలువునా మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యూరియా యాప్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని పేర్కొన్నారు. సీఎం కేంద్రం కొంటేనే తాము కొనుగోలు చేస్తామని అనడం సరైనది కాదన్నారు.
అధికారంలోకి వస్తే అన్ని పంటలకు బోనస్ ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. ఇప్పుడు కేవలం సన్న వడ్లకే అది కూడా కేవలం 7 రకాలకే ఇస్తామని ఈ ప్రభుత్వం మాట మార్చిందని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని రెండు సంవత్సరాలు ఓపిక పట్టాలని, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమేనని కేటీఆర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తారని ఆయన రైతుల సమస్యలన్నింటిని తీరుస్తారన్నారు.
రైతుభరోసాను మింగేసిన ప్రభుత్వం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు చెల్లించాల్సిన రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం మింగేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తెచ్చిన రైతుబీమా పథకం అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో 7 వేల మంది రైతులకు రైతుబీమా డబ్బులు చెల్లించాల్సి ఉందని, ఎల్‌ఐసికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో రైతుబీమా డబ్బులు రావడంలేదని కేటీఆర్ అన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకుందామని, రాష్ట్ర ప్రజలకు అందించవలసిన పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వెంట బోథ్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రులు జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఉన్నారు.
ఎస్‌ఐఆర్‌తో ఓట్లు తొలగిస్తున్నారు!
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని, దీనిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌పై ప్రొజెక్టర్ ద్వారా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వెస్ట్ బెంగాల్, బీహార్‌లో ఓట్లు తొలగించారనే ప్రచారం జరిగిందని అక్కడి మాదిరిగానే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఐఆర్ లో భాగంగా ఓటరు జాబితాను జల్లెడ పట్టే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
ప్రక్రియ లో ప్రతిఒక్కరు పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. అర్హులైన వారిని జాబితాలో చేర్పించాలని.. చనిపోయిన వారిని తొలగించాలని చెప్పారు. ప్రతి బూత్ లెవల్ కార్యకర్తలు భాద్యతగా తీసుకోవాలని ఆదేశించారు. ఒక్క ఓటు కూడా పోవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు జాన్సన్ నాయక్, విలాస్ గాదేవార్, కిరణ్ కుమ్రేవార్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.






