7 March, 2026 | 6:19 AM

టెండర్ విధానంతో నేతన్నలకు నష్టం

07-03-2026 02:04 AM

తెలంగాణలో చేనేత పరిశ్రమ వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. నేతన్నలు చీరెలు, తివాచీలు, బెడ్ షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ తయారు చేసి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ వ్యవ స్థలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) కీలక పాత్ర పోషిస్తూ చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తోంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 10 వేల చేనేత కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి.

వీటికి అనుబంధంగా మరో 15 వేల కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో 60కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35కి పైగా మ్యాక్స్ సంఘాలు పనిచేస్తూ టెస్కోకు అవసరమైన కార్పెట్లు, బెడ్ షీట్లు, లివరీ వస్త్రాలను తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆప్కో ద్వారా, రాష్ట్ర విభజన అనంతరం టెస్కో ద్వారా ప్రభుత్వ సంక్షేమ శాఖలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంజీపీటీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు అవసరమైన వస్త్రాలను సరఫరా చేస్తూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది.

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సంబంధిత శాఖలు తమ అవసరాలను టెస్కోకు తెలియజేస్తాయి. అనంతరం టెస్కో ఆర్డర్లను చేనేత సహకార సంఘాలకు కేటాయిస్తుంది. ఆ సంఘాలు తమ సభ్యులతో కలిసి వస్త్రాలను తయారు చేసి టెస్కోకు అందజేస్తాయి. ఈ విధానం ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (జీఐ) హక్కు పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తులు నాణ్యతకు ప్రతీకగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెస్కో సరఫరా వ్యవస్థలో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

ఈ విధానం అమలులోకి వస్తే ప్రైవేట్ సంస్థలు రంగ ప్రవేశం చేసి వేలాది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయనున్నాయి. తరతరాలుగా నూలుపోగులు అల్లుతూ జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపా ధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లు మూతపడ్డాయి, ఆర్డర్లు తగ్గా యి, ఉపాధి దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా అనేక నేతన్నల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.

మువ్వన్నెల జెండాను నేసిన చేతు లు ఇవే. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను అద్భుతమైన నైపుణ్యం తో నేసిన కళాకారులు నేతన్నలు. అలాంటి కళాకారుల జీవితాలు నేడు కన్నీళ్ల కలబోతగా మారడం సమాజానికి బాధాకరం. రాష్ట్రప్రభుత్వం కూడా చేనేత పరిశ్రమను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో -2024లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ (టెక్స్‌టైల్) శాఖ ద్వారా జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ ద్వారా చేనేత రంగానికి రక్షణ కల్పించింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్ షీట్లు, కార్పెట్లు టెస్కో ద్వారా ఇండెంట్ ఇచ్చి సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

అయినప్పటికీ, ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి టెండర్ విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లోని 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ల విధానం నుంచి వరంగల్ కార్పెట్లు, బెడ్ షీట్లను తొలగించి, పాత పద్ధతి ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి టెండర్ విధానాన్ని పునఃసమీక్షించి రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 కోట దామోదర్ నేత, వ్యాసకర్త సెల్: 93914 80475