3 May, 2026 | 2:25 AM

సన్‌రైజర్స్‌కు ఎదురుందా?

03-05-2026 12:58 AM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్

సూపర్ ఫాంలో హైదరాబాద్

ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరదే

హైదరాబాద్, మే 2: ఐపీఎల్ 19వ సీజన్‌లో ఆదివారం రెండు మ్యాచ్‌లు అభిమానులను అలరించబోతున్నాయి. మధ్యా హ్నం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడబో తోంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ సీజన్‌లో ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత అద్భుతంగా పుంజుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసులో దూసుకెళుతోంది. ప్రస్తుతం 9 మ్యాచ్‌లు ఆడి ఆరింటి లో గెలిచింది. 12 పాయింట్లతో మూడో స్థా నంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన సన్ రైజర్స్ సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్ లోనూ అదరగొడుతున్న సన్ రైజర్స్ ఇప్పుడు హోం గ్రౌండ్‌లో మరో విజయంపై కన్నేసింది. బ్యా టింగ్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెడ్, క్లాసెన్ ఫామ్‌లో ఉన్నారు.

నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ కూడా మెరుపులు మెరిపిస్తే తిరుగులేనట్టే. అటు బౌలింగ్‌లోనూ సన్ రైజర్స్ పటిష్టంగా మారింది. కమిన్స్ వచ్చిన తర్వాత యువ పేసర్లు, సీనియర్లతో సన్ రైజర్స్ బౌలింగ్ ఫుల్ ఫామ్‌లో ఉంది. వరుసగా సాధించిన ఐదు విజయాల్లో బౌలర్ల పాత్ర కూడా ఎంతో ఉంది. దాదాపు ఓడిపో యే మ్యాచ్‌లను కూడా అద్భుతమైన బౌలింగ్‌తో గెలిచిందంటే బౌలింగే కారణం.  దీం తో అన్ని విభాగాల్లోనూ సూపర్ ఫామ్‌లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ పేలవ ఫామ్ నుంచి బయటపడే క్రమంలో వరుసగా రెండు విజయాలు సాధించింది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ రెండు విజయాలు, ఒకటి వర్షంతో రద్దవడంతో 5 పాయింట్లు సాధించింది. ఐదింటిలో ఓడిన కోల్‌కతా గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సూపర్ ఓవర్‌లో విక్టరీ అందుకుంది. చేసింది 155 పరుగులే అయినా అద్భుతమైన బౌలింగ్‌తో ఆ స్కోరును కాపాడుకుంది. ఈ సీజన్‌లో తొలిసారి కేకేఆర్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఈ జోష్ తో ఇప్పుడు సన్ రైజర్స్ ను ఓడించాలని ఎదురుచూస్తోంది.

కానీ ఈ మ్యాచ్ కోల్‌కతాకు పెద్ద సవాలే. ముఖ్యంగా హోంగ్రౌండ్‌లో అత్యంత బలంగా ఉండే సన్ రైజర్స్ ను నిలువరించాలంటే అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుం ది. బ్యాటింగ్‌లో రింకూ సింగ్ ఫామ్‌లోకి రావడం అడ్వాంటేజ్. మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తేనే మంచి స్కోర్లు చేయగలదు. అటు బౌలర్లు గాడిలో పడినప్పటకీ భీకరమై న బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్‌ను కట్టడి చేయడం అంత ఈజీ కాదు. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యా టింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పరుగుల వరద పారడం ఖాయమని చెప్పొచ్చు.

తుది జట్లు అంచనా

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్(కీపర్), క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ రెడ్డి, కమిన్స్(కెప్టెన్), హర్ష్ దూబే, ప్రఫుల్ హింగే, మలింగ

కోల్‌కతా నైట్‌రైడర్స్ : రహానే (కెప్టెన్), నరైన్, రఘువంశీ, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, అంకుల్ రాయ్, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి