3 May, 2026 | 2:45 AM

గుజరాత్ దూకుడు కొనసాగేనా?

03-05-2026 12:54 AM

పంజాబ్ కింగ్స్‌తో బిగ్ ఫైట్

అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్

అహ్మదాబాద్, మే 2: ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఫస్టాఫ్ లో వెనుకబడిన జట్లు పుంజుకుంటున్నాయి. దీనిలో భాగంగా గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో టాప్ 4లో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం గుజరాత్ 9 మ్యాచ్ లలో ఐదు విజయాలు, 4 ఓటములతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ లలోనూ టైటాన్స్ దుమ్మురేపింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను చిత్తు చేసింది. ఈ రెండు విజయాలతోనే ఐదో ప్లేస్ కు దూసుకొచ్చింది.

ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గుజరాత్ ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడబోతోంది. వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న గుజరాత్ కు హౌంగ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. బ్యాటింగ్‌లో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అదరగొడుతున్నా రు. వీరితో పాటు హోల్డర్, షారూఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, తెవాటియా కూడా దూకుడుగా ఆడే సత్తా ఉన్నవారే. వీరిలో ఇద్దరు చెలరేగినా గుజరాత్ కు తిరుగుండదు.

అటు బౌలింగ్ లో రబాడ, సిరాజ్ తో పాటు అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్ లపై అంచనాలున్నాయి. బౌలింగ్‌లో సమిష్టిగా రాణిస్తుండడం గుజరాత్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు పంజాబ్ కింగ్స్ కు గత మ్యాచ్ లో ఓటమి షాక్ అనే చెప్పాలి. సీజన్ ఆరంభం నుంచీ దుమ్మురేపుతున్న పంజాబ్ కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. బ్యాటిం గ్‌లో ప్రతీసారీ భారీస్కోర్లు ఛేజ్ చేస్తున్న ఆ జట్టు గత మ్యాచ్ లో పేలవ బౌలింగ్ తో భారీస్కోరును కాపాడుకోలేకపోయింది. దీం తో వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడినట్టయింది. బ్యాటింగ్ పరంగా పంజాబ్ కు తిరుగు లేదు. అందరూ కలిసికట్టుగా రాణిస్తున్నారు.

ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నోలీ, స్టోయినిస్ ఇలా అంచనాలు పెట్టుకున్న ప్రతీ ప్లేయర్ సత్తా చాటుతున్నారు. అయితే బౌలింగే ఆందోళన కలిగిస్తోంది. వికెట్లు తీస్తున్నా పంజాబ్ బౌలర్లు పరుగులు ఇచ్చేస్తున్నారు. రన్స్ కట్టడి చేయగలిగితే పంజాబ్ మళ్లీ గెలుపు బాట పటొచ్చు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఛేజింగ్ చేసే జట్టు కు అడ్వాంటేజ్. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు ఏడుసార్లు తలపడితే పంజాబ్ నాలుగింటిలో గెలిచింది.

తుది జట్లు అంచనా

పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, మిఛెల్ ఓవెన్ , శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, స్టోయినిస్, మార్కో జెన్సన్, బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్ , చాహల్

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, రబాడ, సిరాజ్