నీట్-2026 పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్-2026 పరీక్ష ఆదివారం నిర్వహిస్తోంది. పరీక్షా నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలలో ఒకటిగా నిలిచే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET), ఎంబీబీఎస్, బీడీఎస్ అనుబంధ వైద్య కోర్సులలో ప్రవేశాలను నిర్ణయిస్తుంది.
నీట్ యుజీ-2026 పరీక్ష, ఆఫ్‌లైన్ (పెన్-అండ్-పేపర్) విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒకే విడతలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాల్సి ఉంటుందని, ప్రవేశం మధ్యాహ్నం 1:30 గంటలకు ముగించబడుతుంది. ప్రశ్న పత్రంలో మొత్తం 720 మార్కులకు గాను 180 ప్రశ్నలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో 199 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహణ, పెన్, పేపర్ విధానంలో పరీక్ష ఉంటుందని నిర్వహకులు తెలిపారు.
ఎన్టీఏ ఇంతకుముందు తెలియజేసినట్లుగా, పరీక్ష రోజున కఠినమైన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి. అభ్యర్థులు తమ నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలి. గుర్తింపును నిర్ధారించడానికి కేంద్రాలలో బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతోంది. ఎన్టీఏ వివరణాత్మక దుస్తుల నియమావళిని కూడా సూచించింది.






