ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కడ్తాల్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా నార్లకుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తాం.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా వర్తింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
అనంతరం మక్త మాదారం గేటు వద్ద నిర్వహించిన ’ప్రభుత్వ పాఠశాలల బలోపేతం’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తుండటం వల్ల రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశా లలకు దీటుగా ప్రభుత్వ బడులలో ఎల్కేజీ నుండే తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం అవసరం
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత ఆమనగల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ తల్లోజు గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, స్థానిక ఎంఈఓలు పాండు నాయక్, చంప్ల నాయక్, నిర్మల, సర్దార్ నాయక్, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, జగన్ పాల్గొన్నారు.






