14 May, 2026 | 1:03 AM

ఆఖరి మజిలీకి ఎన్ని కష్టాలో..?

14-05-2026 12:00 AM

వైకుంఠధామాలు ఉన్నా.. వసతులు సున్నా..

సదుపాయాలు లేక ప్రజల అవస్థలు

చేగుంట, మే 1౩: మనిషి జన్మించి జీవితాంతం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. కుటుంబం కోసం, బతుకుబండిని లాగేందుకు రోజంతా శ్రమిస్తాడు. ఈ ఒత్తిడితో కూడిన జీవితంలో 60 నుంచి 70 ఏళ్లు జీవించడమే పెద్ద సవాలుగా మారింది. కానీ జీవితం ముగిసిన తర్వాత అయినా తన ఆఖరి ప్రయాణం ప్రశాంతంగా జరగాలని ప్రతి ఒక్కరి కోరిక. అయితే చేగుంట మండలంలోని అనేక గ్రామాల్లో ఆ చివరి మజిలీ కూడా ప్రజలకు కష్టాలమయంగా మారింది.

గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు మౌలిక వసతుల లేమితో నిరుపయోగంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాం తాల్లో స్మశానవాటికలను ఆధునికీకరించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చేగుంట మండలంలోనే 24 వైకుంఠధామాలు నిర్మించగా, ఒక్కో దానికి సుమారు రూ.15 లక్షల వరకు నిధులు కేటాయించారు. కానీ నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటి నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై సరైన శ్రద్ధ లేకపోవడంతో ఇవి ఇప్పుడు ప్రజలకు ఉపయోగం కాకుం డా మారిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

ముఖ్యంగా నీటి సౌ కర్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దహన సంస్కారాలకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బట్టలు మార్చుకునేందుకు నిర్మించిన గదులకు తలుపులు లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం వల్ల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని వైకుంఠధామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేక రాత్రి సమయంలో దహన సంస్కారాలు నిర్వహిం చాల్సి వస్తే మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

నీటి సౌకర్యం కల్పించాలి.. 

ప్రభుత్వం ప్రతి వైకుంఠధామానికి బోర్వెల్ ఏర్పాటు చేసి నీటి సదుపాయం కల్పించాలని నిధులు మంజూరు చేసిన ప్పటికీ, కొన్ని చోట్ల బోర్లు వేయకుండానే వేసినట్లు పత్రాలు సృష్టించి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు అవినీతికి బలవుతున్నాయని మండిపడుతున్నారు. గ్రామాల్లో భూమి ఉన్న రైతులు తమ పొలాల్లోనే దహన సంస్కారాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నా, భూమిలేని పేద కుటుంబాల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

కొందరు చెరువుల దగ్గర లేదా గ్రామానికి దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందని వాపోతున్నారు. దహన సంస్కారాల అనంతరం శుభ్రత కోసం చెరువులకు వెళ్లాల్సి రావడం, లేకపోతే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను డబ్బులు చెల్లించి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది పేద కుటుంబాలపై అదనపు భారం మోపుతోందని గ్రామస్థులు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో వైకుంఠధామాల భవనాలు నిర్మించి వదిలేయడంతో అవి ఇప్పుడు పాడైపోతున్నాయి. ఎక్కడికక్కడ పొదలు పెరిగి పోవడం, చెత్త పేరుకుపోవడం, రక్షణ లేకపోవడం వల్ల ప్రజలు వాటిని వినియోగించేందుకు కూడా వెనుకాడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్మించిన వైకుంఠధామాలు ఇలా నిర్లక్ష్యానికి గురవడం బాధాకరమని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినా, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రతి వైకుంఠధామంలో వంటి మౌలిక వసతులు కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బతికున్నప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నాం& కనీసం చనిపోయిన తర్వాతైనా గౌరవంగా ఆఖరి యాత్ర జరిగే పరిస్థితులు కల్పించాలి అని గ్రామస్తులు వేడుకుంటున్నారు.