ఎన్‌హెచ్‌ఏఐకి రూ. 819 కోట్ల నికర అవార్డు
- పానిపట్ - జలంధర్ నేషనల్ హైవేకు సంబంధించిన కేసుల్లో విజయం
- ఎన్‌హెచ్‌ఏఐ వాదనలను సమర్థించిన ట్రిబ్యునల్
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : ప్రజాధనాన్ని కాపాడటంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఉంటున్నాయి. తాజాగా పానిపట్-జలంధర్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ఆర్బిట్రేషన్ కేసుల్లో రూ.819.96 కోట్ల నికర అవార్డు దక్కించుకున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వెల్లడించారు. ఈ వివాదాలు ప్రధానంగా ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యం, టోల్ ఆదాయంలో నష్టం, టెర్మినేషన్ పేమెంట్‌లు, ప్రాజెక్టు వ్యవధి పొడిగింపు, ఎస్కలేషన్ ఖర్చులు, ఒప్పంద ఉల్లంఘనలకు సంబంధించిగా పేర్కొన్నారు.
దాఖలైన క్లెయిమ్‌లు
మొదటి ఆర్బిట్రేషన్ కేసులో కన్సెషనైర్ రూ.5,443 కోట్లకు పైగా క్లెయిమ్‌లు దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా టోల్ నిర్వహణ వల్ల నష్టం, అవకాశాలు కోల్పోవడం, టెర్మినేషన్ చెల్లింపులు వంటి అంశాలను ప్రస్తావించారు. అయితే ఒప్పంద ఉల్లంఘనలు కన్సెషనైర్ వైపు నుంచే జరిగాయని, టెర్మినేషన్ చట్టబద్ధమేనని ఎన్‌హెచ్‌ఏఐ వాదించింది. సాంకేతిక ఆధారాలు, ప్రాజెక్టు రికార్డులను పరిశీలించడంతో పాటు నిపుణుల వాదనలు విన్న ట్రిబ్యునల్.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతివాదనలను సమర్థించింది.
సుమారు రూ.115.73 కోట్ల నికర అవార్డును ఎన్‌హెచ్‌ఏఐకి ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. రెండో కేసులో రూ.2,931.79 కోట్లకు పైగా క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. ఆలస్యాల కారణంగా నష్టాలు, ఎస్కలేషన్, అదనపు ఖర్చులు, యంత్రాల నిర్వీర్యత వంటి అంశాలపై పరిహారం కోరారు. అయితే సరైన ఆధారాలు లేవని, ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్‌లు లేవని ఎన్‌హెచ్‌ఏఐ వాదించింది. ఈ కేసులో కూడా ట్రిబ్యునల్ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించి, సర్దుబాట్ల అనంతరం రూ.704.23 కోట్లు ఎన్‌హెచ్‌ఏఐకి అనుకూలంగా అవార్డు ఇచ్చింది.
గతంలోనూ ఎన్‌హెచ్‌ఏఐ విజయం
గతంలో గుజరాత్‌లోని కమ్రేజ్ ఎన్‌హెచ్ సిక్స్ లేనింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆర్బిట్రేషన్ కేసులోనూ ఎన్‌హెచ్‌ఏఐ విజయం సాధించింది. కాంట్రాక్టర్ కోరిన రూ.174.49 కోట్ల క్లెయిమ్‌లకు బదులుగా కేవలం రూ.54 లక్షలతోనే కేసు ముగిసింది. ఈ విజయాలు జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ప్రజాధనం రక్షణ, ఒప్పందాల కఠిన అమలు, బాధ్యతాయుత వ్యవస్థ, పారదర్శకతను మరింత బలపరిచాయని అధికారులు పేర్కొన్నారు.






