బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
- డీజీపీ సీవీ ఆనంద్
సిద్దిపేట క్రైం: బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. బుధవారం పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రధాన రహదారులు, జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేయాలని సూచించారు.
సోషల్ మీడియాలో చట్టవ్యతిరేక, రెచ్చగొట్టే, అసత్య ప్రచారాలపై నిరంతర నిఘా ఉంచి, అటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రవేశ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందితో పాటు వెటర్నరీ సిబ్బందిని కూడా నియమించాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
మసీదులు, ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఎలాంటి చట్టవ్యతిరేక, అసభ్యకరమైన, అసత్య సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పండుగను అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, మత సామరస్యం, శాంతియుత జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు.ఈ సమావేశానికి ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, సిద్దిపేట డివిజన్ ఏసీపీ రవీందర్ రెడ్డి ,హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐలు, వెటర్నరీ, మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు






