14 May, 2026 | 1:36 AM

30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

14-05-2026 12:47 AM
  1. రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ 
  2. సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర వెల్లడి 

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : రైతుల నుంచి వరి ధాన్యం సేకరణ రాష్ట్రంలో ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటీ వరకు 30 లక్షల మెట్రిక్ ( ఎల్‌ఎంటీ ) టన్నుల వరి సేకరిచి, రూ. 4,520 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.  రాష్ట్ర ప్రభుత్వం 9 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం, 21 లక్షల మెట్రిక్ టన్నుల  దొడ్డు రకం ధాన్యం సేకరించినట్లు ఆయన తెలిపారు. 

ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో   8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీఏసీఎస్  ద్వారా   4,350 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 3,563, మరియు ఇతర సహాయక ఏజెన్సీల ద్వారా  662 కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ కేంద్రాలన్నింటిలో 18.6 కోట్ల గోనె సంచులు,  తగినన్ని టార్పాలిన్లను ముందుగానే సిద్ధంగా చేసినట్లు చెప్పారు. 

కొనుగోలు చేసిన వరి ధాన్యం ఆలస్యం లేకుండా కేంద్రాల నుండి నేరుగా మిల్లులకు తరలించడానికి లారీలు, ట్రాక్టర్లు  డీసీఎంలన్ని కలిపి సుమారు 11,500 రవాణా వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెపపారు. హమాలీ కొరతను పరిష్కరించడానికి, భారీగా వచ్చే వరి ధాన్యాన్ని నిర్వహించడానికి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కొనుగోళ్లను వేగవంతం చేయడానికి హామాలీ రేట్లు కూడా క్వింటాకు రూ. 17 పెంచినట్లు చెప్పారు. రైతులు,  సాగుదారులు తమ సందేహాలు, ఆందోళనలు లేదా సహాయం కోసం  1967 టోల్-ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలని కోరారు.