14 May, 2026 | 2:03 AM

ముగిసిన‘ బాలమంగళం’ శిబిరం

14-05-2026 01:13 AM

హనుమకొండ, మే 13 (విజయక్రాంతి): చిన్నారుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘బాలమంగళం‘ బాల బాలికల వేసవి శిక్షణ శిబిరం బుధవారం నాడు ఘనంగా ముగిసింది. మే 5వ తేదీన ప్రారంభమైన శిబిరం 9 రోజులపాటు విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగింది.

ఈ సందర్భంగా హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద నంద యోగా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మాధవ స్మారక సమితి అధ్యక్షులు డాక్టర్ కోదాటి సుధాకర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎం.జీ.ఎం రిటైర్డ్ ఆర్.ఎం.ఓ, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ మహానగర్ సంఘచాలక్ డాక్టర్ బందెల మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల, బాలికల్లో భారతీయ సంస్కృతి, సభ్యతలను పెంపొందింపజేస్తున్న మాధవస్మారక సమితికి అభినందనలు తెలియజేశారు.

నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, శారీరక దృఢత్వం పట్ల పట్ల అవగాహన కల్పించడమే ఈ శిబిర ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన యోగాసనాలు, సైన్స్ ప్రదర్శనలు, వారు నేర్చుకున్న నైతిక విలువలపై చేసిన ప్రసంగాలు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లెక్కల జలంధర్ రెడ్డి, మాధవస్మారక సమితి ప్రధాన కార్యదర్శి దాస్యం రామానుజం, కుటుంబ ప్రబోధన్ వరంగల్ విభాగ్ సంయోజక్ ఆర్. లక్ష్మణ్ సుధాకర్, విజ్ఞాన భారతి రాష్ట్ర కన్వీనర్ సత్తు రామనాథం, సంస్కృత భారతి పేట శ్రీనివాస్ తో పాటు బాల బాలికల తల్లిదండ్రులు హాజరయ్యారు.