ప్రతి గిరిజన తండాకు స్వచ్ఛమైన నీరందించడమే లక్ష్యం
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కడ్తాల్, మే 13 (విజయక్రాంతి): ప్రతి గిరిజన తండాలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడమే ఐక్యత ఫౌండేషన్ ప్రధాన ఆశయమని ఫౌండేషన్ ఛైర్మన్, టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండలం గాన్గుమర్ల తండాలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. గత పర్యటనలో తండా వాసులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుషిత నీటి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని, స్వచ్ఛమైన నీరు అందించడం ద్వారా గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని సుంకిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఐక్యత ఫౌండేషన్ సేవలు అందిస్తోందని తెలిపారు.
గతంలో కానుగుబావి తండా దేవాలయ అభివృద్ధికి కూడా సహకారం అందించినట్లు గుర్తుచేశారు. మారుమూల తండాల సమస్యలను గుర్తించి, లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు తండా వాసులు, స్థానిక నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్, సర్పంచ్ సేవ్యా, ఉప సర్పంచ్ లక్పతి నాయక్, ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీను, రాజు, గోపి, నాగార్జున మరియు తండా వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






