14 May, 2026 | 2:03 AM

ఇంటర్ పరీక్ష రాసిన దేవ్ జీ

14-05-2026 12:49 AM
  1.   42 ఏళ్ల తర్వాత పరీక్ష హాల్‌లోకి మాజీ మావోయిస్టు నేత 
  2. జగిత్యాలలో ఇంటర్ రెండో ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు
  3. ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి

జగిత్యాల, మే 13 (విజయక్రాంతి): సాధారణంగా పరీక్షా హాళ్లలో భవిష్యత్తు కోసం కలలు కనే విద్యార్థులు, ఉద్యోగాల కోసం పోటీ పడే యువత ఉంటారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బుధవారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రంలో కనిపించిన ఒక వ్యక్తి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకప్పుడు అడవుల్లో తుపాకీతో తిరిగిన మాజీ మావోయిస్టు అగ్రనేత, పెన్నుతో పరీక్ష రాయడానికి పరీక్షా హాల్‌లోకి అడుగుపెట్టారు.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కామ్రేడ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సుమారు 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మారి పరీక్ష రాయడం విశేషంగా మారింది. 1982లో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న సమయంలో ఆయన తెలుగు పరీక్ష తప్పిపోయింది. ఆ ఒక్క పరీక్ష రాయలేకపోవడంతో ఇంటర్ విద్య అసంపూర్తిగానే మిగిలిపోయింది. 

అదే సమయంలో సమాజంలో ఉన్న అసమానతలు, పేదల సమస్యలు, అన్యాయాలు ఆయన మనసును కదిలించాయి. విద్యార్థి జీవితాన్నే వదిలి విప్లవ బాట పట్టారు. అడవులు ఆయనకు ఆశ్రయమయ్యాయి. తుపాకీ ఆయనకు ఆయుధమైంది. దశాబ్దాల పాటు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న తిరుపతి దేవ్ జీగా మావోయిస్టు ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే కాలం మారింది. పరిస్థితులు మారాయి. పోరాటాల పద్ధతులు మారాయి.

చివరకు దేవ్ జీ సాధారణ జీవనంలోకి వచ్చారు. కానీ జీవితంలో ఒక అసంపూర్తి మాత్రం ఎప్పటికీ ఆయనను వెంటాడింది. 1982లో రాయకపోయిన తెలుగు పరీక్ష ఇప్పుడు రాయాలనే సంకల్పంతో ఆయన ఇంటర్ బోర్డును సంప్రదించి ప్రత్యేక అనుమతి పొందారు.

బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత పరీక్షా హాల్లోకి అడుగుపెట్టిన దేవ్ జీని చూసి అక్కడి విద్యార్థులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా దేవ్ జీ మాట్లాడుతూ.. ‘ఇంటర్ పూర్తి చేసిన తర్వాత న్యాయ విద్య అభ్యసించాలని ఉంది. పేదలకు న్యాయ సహాయం అందించాలనేది నా కోరిక” అని తెలిపారు.