మనకు పొదుపు సూత్రాలు.. ఆంధ్రప్రదేశ్‌కు పైసలా?
మోదీ తెలంగాణ పర్యటనపై టీఆర్‌ఎస్ చీఫ్ కవిత విమర్శలు
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తారని భావించినా మనకు పొదుపు సూత్రాలు చెప్పి.. ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని పేర్కొన్నారు. బుధవారం బంజరాహిల్స్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఒక వైపు పోలవరం పూర్తి చేసేందుకు చంద్రబాబునాయుడు కృషి చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం పాలమూరు - రంగారెడ్డిని ప్రాజెక్ట్‌ను పట్టించుకోవటం లేదన్నారు. తన గురువు చంద్రబాబును చూసైనా నేర్చుకోవాలని రేవంత్‌కు సూచించారు.
జాతీయ హోదా గురించి ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ ఎందుకు మౌనంగా ఉందని కవిత ప్రశ్నించారు. ప్రధాని పర్యటనలో తెలంగాణకు ఏం ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలో సాగు యోగ్యమైన ప్రతి గుంటకు నీళ్లు ఇస్తామని, ఇందుకోసం వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక లష్కర్‌ను నియమిస్తామని చెప్పారు.
తెలంగాణలో ఉన్న అన్ని నదులపై గేట్లతో కూడిన చెక్ డ్యామ్‌లు కడుతామన్నారు. ఈ నెల 20 నుంచి చేపట్టబోయే జెండా పండుగ పార్టీ నిర్మాణానికి పునాది అని, జెండా పండుగ నిర్వహణ ఆధారంగా పదవులు ఇస్తామని కవిత చెప్పారు. బీసీలకు చట్టసభలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతామని చెప్పారు. నీట్ పేపర్ లీక్‌నపై కవిత మండిపడ్డారు. ఇంత టెక్నాలజీ వచ్చినా పేపర్ లీక్ కాకుండా చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు.
రైల్వే కోర్టుకు హాజరైన కవిత
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కల్వకుంట్ల కవిత బుధవారం నాంపల్లిలోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అవసరమైతే నిరవధిక రైల్ రోకో చేసేందుకు కూడా సిద్ధమని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా కేసు తదుపరి విచారణను మెజిస్ట్రేట్ జూలై 17కు వాయిదా వేశారు.






