14 May, 2026 | 12:44 AM

కోయత్తూరు భాషకు రాజ్యాంగ హోదా కల్పించాలి

14-05-2026 12:00 AM
  1. జనగణనలో ఆదివాసీ మతానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలి
  2. మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచందర్ రావు

ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): కోయత్తూరు భాషకు రాజ్యాంగ గుర్తింపు, హోదా కల్పించాలని మాజీ డీజీపీ, ఏఐబిఎస్‌పి జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె. పూర్ణ చందర్‌రావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం బాగ్‌లింగంపల్ల్లి  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కలు, సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో ‘మా ఊళ్లో -మా రాజ్యం’ అనే నినాదంతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పూర్ణ చందర్‌రావు మాట్లాడుతూ 2027 జనగణనలో ఆదివాసీ మతానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలన్నారు. దేశంలోని ఐదో షెడ్యూల్, ఆరోవ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలను సమీకరించి ఆదివాసీ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. భాష సాంస్కృతి కోల్పోతే ఆదివాసీల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఆదివాసీ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు వేగంగా అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కోయత్తూరు భాష కోట్లాది ఆదివాసీల జీవన సంస్కృతికి ప్రతీక అని దానిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల భూమి, అటవీ హక్కులు, స్వయం పాలన రక్షణ కోసం ప్రత్యేక రాష్ట్రం ఎంతో అవసరం అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన పరిరక్షణ సమన్వయ సమితి జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర మాట్లాడుతూ మహారాష్ట్ర నమూనాను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం అమలుపై గవర్నర్‌కు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. జీవో నెం. 3ను పునరుద్దరించడంతో పాటు పోలవరం నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, జాతీయ కన్వీనర్ కే. రాజారావు, మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్, బీసీ ఇంటలెక్చ్యుల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు, ప్రొ.కాశీం, బక్క పరంజ్యోతి, జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి కోశాధికారి లోకిని రాజు, సంగెం సూర్యరావు, వి. నారాయణ రావు, పొడుగు శ్రీనాధ్, పాయం సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.