15 March, 2026 | 3:16 AM

కొండపై వ్యూహాత్మక కోట

15-03-2026 12:14 AM

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం ఖిల్లా ఘనపురం 

ఘనపురం కోట శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా ఎత్తయిన కొండల మీద రాతి గోడలతో నిర్మించిన కట్టడాలు, సాగు తాగు నీటి అవసరాల కోసం కాకతీయుల కాలంలోనే గోన గన్నారెడ్డి నిర్మించిన గణప సముద్రం. రాజుల కట్టడాలకు చరిత్రకు నేటి తరానికి సాక్ష్యంగా నిలిచిన వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం కోట. వనపర్తి జిల్లాలోని ఖిల్లాలోని ఘనపురం మండల కేంద్రంలో ఘనపురం కోట నిర్మాణం అప్పటి పాలకుల సైనిక వ్యూహాలకు ప్రతీకగా నిలుస్తుంది.

కొండపై నిర్మించిన ఈ కోట నుంచి దూర ప్రాంతాలను సులభంగా గమనించవచ్చు. శత్రువుల దాడులను ముందుగానే గుర్తించి రక్షణ చర్యలు చేపట్టేందుకు ఇది ఎంతో అనుకూలంగా ఉండేదని, కోటలో రాజవంశీయుల నివాసాలకు గదులు, సైనికుల కోసం ప్రత్యేక వసతులు ఉండేవని స్థానికులు చెపుతున్నారు. ఘనపురం కోట నిర్మాణంలో అప్పటి శిల్పకళ స్పష్టంగా కనిపిస్తుంది. భారీ రాతి బండలను ఉపయోగించి గోడలు నిర్మించారు. గోడలు బలంగా ఉండేలా ప్రత్యేకంగా నిర్మించారు. ఇప్పటికీ అక్కడ కనిపించే నిర్మాణాలు ఆ కాలంలోని ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి.

గోనా గన్నారెడ్డి నిర్మించిన గణప సముద్రం 

కాకతీయుల పాలనలో తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం విస్తృతంగా జరిగింది. వర్షపు నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి ఉపయోగించేందుకు చిన్న పెద్ద చెరువులను నిర్మించారు. ఈ చెరువులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలిచాయి. గణప సముద్రం కూడా అలాంటి గొప్ప చెరువులలో ఒకటిగా చరిత్రలో గుర్తింపు పొందింది. కాకతీయ సామ్రాజ్యంలో ప్రముఖ సేనాధిపతిగా ఉన్న గోనా గన్నారెడ్డి సైనిక విజయాలతో పాటు ప్రజల సంక్షేమం కోసం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు అందులో భాగంగానే వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి వనరులు అవసరమని గుర్తించిన ఆయన ఘనపురం ప్రాంతంలో ఈ చెరువును నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు.

పచ్చని కొండలు, ప్రకృతి అందాలు

ఘనపురం కోట చుట్టూ పచ్చని కొండలు, ప్రకృతి అందాలు కనిపిస్తాయి. కొండపై నుంచి పరిసర ప్రాంతాల అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ఈ ప్రదేశం మరింత ఆకర్షణీయంగా ఉంటుం ది. ఎత్తయిన కొండల మీద రాతి గోడలతో కట్టిన కట్టడాలు, ప్రజలకు సాగు తాగు నీటి అవసరాల కోసం నిర్మించిన గణప సముద్రం నాటి రాజుల పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రాంతంలో కొండపై నిర్మించిన ఘనపురం కోట ఒకప్పుడు రాజుల రక్షణ కేంద్రంగా నిలిచింది. భారీ రాతి గోడలు, వ్యూహాత్మక నిర్మాణం ఈ కోటకు ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ప్రస్తుతం కాలగమనంలో శిథిలావస్థకు చేరినా, గత వైభవాన్ని గుర్తు చేస్తూ ఈ కోట నిశ్శబ్దంగా నిలుస్తోంది.

అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రం 

ఘనపురం కోటను అభివృద్ధి చేస్తే జిల్లాకు మంచి గుర్తిం పు వచ్చే అవకాశం ఉంది. రహదారులు, సమాచారం బోర్డు లు, వీక్షణ స్థలాలు ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం కోటలోని అనేక భాగాలు పాడైపోతున్నాయి. రాతి గోడలు పగిలిపోవడం, చెట్లు పెరగడం వల్ల కోట నిర్మాణం దెబ్బతింటోంది. సరైన సంరక్షణ లేకపోవడంతో ఈ చారిత్రక వారసత్వం క్రమంగా కనుమరుగవుతోందని  కోటను సంరక్షించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.