27 June, 2026 | 10:32 PM

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి

27-06-2026 09:36 PM

- జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ,(విజయక్రాంతి): పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జననం నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. "నిండు ప్రాణానికి రెండు చుక్కలు" అనే నినాదంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 460 పోలియో బూత్‌లు, 27 మొబైల్ బృందాలు, 12 ట్రాన్సిట్ బృందాలు, 27 పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు 1,804 మంది సిబ్బందిని నియమించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ (ఆదివారం) జిల్లాలోని గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. అనంతరం 29, 30 తేదీల్లో మొదటి రోజు వ్యాక్సిన్ తీసుకోలేని చిన్నారులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు.

పోలియో నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో ఏ ఒక్క చిన్నారి కూడా వ్యాక్సిన్‌కు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని, సమీప పోలియో కేంద్రానికి తమ చిన్నారులను తీసుకువచ్చి రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి కోరారు.