27 June, 2026 | 10:55 PM

వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌పై డీఎస్పీ ఆకస్మిక తనిఖీ

27-06-2026 09:47 PM

రికార్డులు, కేసుల పురోగతి, ప్రజాసేవలపై సమగ్ర సమీక్ష

ధర్మపురి,(విజయక్రాంతి): జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ అధికారి (డీఎస్పీ) పురుషోత్తం రెడ్డి శనివారం వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు ఫైళ్లు, స్టేషన్ జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, సీసీటీఎన్‌ఎస్ నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, వారెంట్లు, సమన్లు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

రికార్డులను చట్టబద్ధంగా, పారదర్శకంగా, సమయానుకూలంగా నవీకరించాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ ప్రజలకు న్యాయం అందించే తొలి వేదిక అని పేర్కొంటూ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.

మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు సంబంధించిన కేసులను అత్యంత సున్నితంగా, మానవీయ దృక్పథంతో విచారించాలని తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ షీ-టీమ్స్, సైబర్ అవగాహన కార్యక్రమాలు, మహిళా రక్షణ చట్టాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు.

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ, బ్యాంక్ వివరాలు, క్యూఆర్ కోడ్, సోషల్ మీడియా మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, పేకాట, జూదం, ఇసుక అక్రమ రవాణా, గుట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.

గ్రామస్థాయి ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేసి గ్రామ సందర్శనలు పెంచాలని, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువతతో సమన్వయం పెంపొందించాలని తెలిపారు. చిన్న వివాదాలను చట్టపరంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించే కమ్యూనిటీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేసి, శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని, కోర్టులో సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.