27 June, 2026 | 10:54 PM

ఆక్రమణలపై ఉక్కుపాదం.. గండిపేటలో భారీగా కూల్చివేతలు

27-06-2026 09:57 PM

* 50కి పైగా షెడ్లు, డబ్బాల తొలగింపు

* పోలీసు బందోబస్తు మధ్య డ్రైవ్

* ట్రాఫిక్ కష్టాలకు చెక్

మణికొండ,(విజయక్రాంతి)గండిపేట ప్రధాన రహదారుల ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రోడ్ల కుదింపుతో ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలపై వాహనదారులు, స్థానికుల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులతో స్పందించిన యంత్రాంగం శనివారం భారీ కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి వేసిన 50కి పైగా షెడ్లు, వ్యాపార సముదాయాల డబ్బాలను జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన '99 రోజుల ప్రణాళిక'లో భాగంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద, టీపీఓ రమేష్ ఆధ్వర్యంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది.

గోల్కొండ రిసార్ట్ నుంచి సాయిబాబా ఆలయం మీదుగా ఇంద్రారెడ్డి విగ్రహం వరకు, అలాగే గండి మైసమ్మ కమాన్ నుంచి యూనియన్ బ్యాంక్ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. వ్యాపారులు తమ షట్టర్ల ముందు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల షెడ్లను సైతం ఏమాత్రం ఉపేక్షించకుండా కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, చైన్‌మెన్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఆక్రమణల తొలగింపుతో ప్రధాన రోడ్లు విశాలంగా మారడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.