బిల్లుల కోసమే ఈ చీలికలా!
డాక్టర్ తిరునహరి శేషు :
18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించాయి. 2014, తర్వాత 2౦19 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే అద్భుతమైన మెజార్టీ సాధించింది. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలాన్ని అందుకోలేకపోయింది. విపక్షాల ‘ఇండియా కూటమి’ స భలో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది.
దీనివల్ల గతంలోలాగా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడంలో, పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడాల్సి వస్తున్నది. గతంలో లోక్‌సభలో ఎన్డీయే కూటమికి మూడింట రెండు వంతుల (2/3) మెజార్టీ ఉండేది. అప్పట్లో 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, క్రిమినల్ చట్టాల సవరణ వంటి బిల్లులను ప్రభుత్వం సులువుగా ఆమోదింపజేసుకుంది.
నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాల బిల్లులనూ అవలీలగా పాస్ చేయించుకోగలిగింది. ప్ర స్తుత లోక్‌సభలో మోదీ నేతత్వంలోని ఎన్డీ యే ప్రభుత్వానికి కేవలం సాధారణ మె జార్టీ మాత్రమే ఉంది. మూడింట రెండు వంతుల బలం లేకపోవడంతో తాము ప్రవేశపెడుతున్న కీలక బిల్లులు సభలో ఆగిపోతున్నాయి.
బీజేపీకి సంఖ్యాబల సమస్య
జమిలి ఎన్నికల బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని అడ్డుకోవడంలో విపక్షాలు విజయం సా ధించాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లు సభలో పాస్ కాకపోవడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ 131వ రా జ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చినప్పుడు విపక్షాలు గట్టిగా నిలిచాయి.
ఇండియా కూటమికి చెందిన 230 మంది సభ్యులు ఐక్యంగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ప్రభుత్వానికి 352 ఓట్లు కావాలి. ప్రభు త్వం కేవలం 298 ఓట్ల మద్దతును మాత్ర మే కూడగట్టగలిగింది. దాంతో బిల్లు వీగిపోయింది. ఈ ఓటమిని ప్రభుత్వం అవమానకరంగా భావిస్తున్నది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి, బీజేపీ విజయం తర్వాత దేశ రాజకీయాలు వేగం గా మారాయి.
టీఎంసీ నుంచి 20 మంది లోక్‌సభ సభ్యులు విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. బాల్ ఠాక్రే శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు షిండే శివసేన వర్గంలోకి వెళ్లారు. వీటికి తోడు 22 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉన్న డీఎంకే కూడా ఇండియా కూ టమి నుంచి తప్పుకున్నది. ఈ పరిణామాలతో లోక్‌సభలో ఎన్డీ యే బలం అనూ హ్యంగా పెరిగింది. విపక్ష కూటమి బలం పడిపోయింది.
విపక్ష కూటమిలోని రెండు పార్టీలు చీలిపోయాక లోక్‌సభలో ఎన్డీ యే బలం 318కి చేరింది. శరద్ పవార్ ఎన్‌సీపీలో, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో కూడా చీలికలు వస్తాయనే ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే రాజ్యాంగ సవర ణ బిల్లులకు కావాల్సిన మూడింట రెండు వంతుల మెజార్టీని ఎన్డీయే ప్రభుత్వం సు లువుగా సాధిస్తుంది. రాబోయే వర్షాకాల సమావేశాలలో మహిళా, డీ లిమిటేషన్ బిల్లును మళ్లీ తీసుకువచ్చేందుకు కేంద్రం భావిస్తున్నది.
ప్రస్తు తం ఉన్న బలాన్ని బట్టి ప్రభుత్వానికి 324 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బిల్లు పాస్ అయ్యేందుకు మరో 36 ఓట్లు (మొత్తం 360) కావాలి. డీఎంకే, శరద్ పవార్ ఎన్‌సీపీ వైఖరిపై అనుమానాలు ఉన్నప్పటికీ, ఈసారి బిల్లు ను గట్టెక్కించేందుకు కావాల్సిన మెజార్టీని ప్రభుత్వం సాధించగలదనే నమ్మకంతో ఉంది. రాజ్యసభలోనూ ఎన్డీ యే బలం 153కి చేరింది.
ముగ్గురు టీఎం సీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యం లో, అక్కడ కూడా మూడిం ట రెం డు వంతుల మెజార్టీకి కావాల్సిన 161 మంది సభ్యుల బలాన్ని కూడగట్టడం ప్ర భుత్వానికి పెద్ద కష్టం కాకపోవచ్చు. లోక్‌సభలో విపక్ష పార్టీలను చీల్చడం ద్వారానే బీజేపీ ఈ బలాన్ని పెంచుకుంటున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
మ హిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు, జమిలి ఎన్నికల బిల్లులను ఎలాగైనా పాస్ చేయించుకోవాలనేదే కేంద్రం వ్యూహంగా కని పిస్తున్నది. అమ్ముడుపోయేవాళ్లు ఉంటే కొనేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటారనే విమర్శలు ఈ చీలికల నేపథ్యంలో వినిపిస్తున్నాయి.
జమిలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు
గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కనువిప్పు కలిగించాయి. ఆ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోయినా, ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయాలు సాధించింది. ముఖ్యం గా మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బంగాల్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో సాధించిన గెలు పు విపక్షాలను ఆత్మరక్షణలో పడేసింది. ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడం ఎవరికీ సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ప్రధాని మోదీ నాయకత్వంలో నాలుగోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ఎ న్నికల వ్యూహాలకు పదును పెడుతున్నది. తమను బలంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం, కాంగ్రెస్‌ను బలహీనపరచడంలో బీజేపీ విజయం సాధి స్తూ వస్తున్నది. విపక్ష ఇండియా కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల్లో 230 స్థానాలు గెలిచి బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. పార్లమెంట్‌లో అధికార పక్షాన్ని పలుమా ర్లు నిలదీసింది.
కీలకమైన 131వ రాజ్యాం గ సవరణ బిల్లును అడ్డుకోగలిగింది. ఇటీవల ౫ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటములతో విపక్ష కూటమి బలహీనపడింది. మమతా బెనర్జీ, తేజస్వి వంటి నాయకులు ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకోవాల్సి ఉంది. రాబోయే యూపీ, పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు మంచి ఫలితాలు సాధిస్తే బీజేపీని అడ్డుకోవడం అసాధ్యమేమీ కాదు. కేవలం రాజకీయ వ్యూహాలు, భావోద్వేగాలే ఎన్నికలను ప్రభావితం చేసినంత కాలం ఎన్డీయే కూటమి తన అధికారాన్ని కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వ్యాసకర్త సెల్ : 98854 65877






