నకిలీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం
- మందమర్రిలో ముగ్గురు నిందితుల అరెస్ట్
మందమర్రి,(బెల్లంపల్లి),(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురినీ పట్టుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు, రెండు ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. సంఘటన వివరాలు మందమర్రి ఎస్సై నరేష్ వెల్లడించారు. రైతులను మోసం చేస్తూ లాభాలు గడించడమే ధ్యేయంగా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో పట్టుకున్నారు.
నిందితుల నుండి సుమారు 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు, రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మందమర్రి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, మందమర్రి పోలీసులు కలిసి శనివారం ఉదయం 08:30 గంటల ప్రాంతంలో NH-363, అందుగులపేట శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోఅనుమానాస్పదంగా రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి విచారించగా నకిలీ విత్తనాల గుట్టు రట్టయింది.
ఈ సంఘటనలో పాత మంచిర్యాల మధునగర్ కు చెందిన మాకినేని రాఘవేంద్ర, మందమర్రి మండలం బురదగుడెం గ్రామానికి చెందిన కట్ట నరేశ్, పుట్టగంటి పవన్ కుమార్ అరెస్టయ్యారు. నిందితుల నుంచి నకిలీ పత్తి విత్తనాలు, ఎటువంటి సర్టిఫైడ్ లేబుల్స్, బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలు. రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి ఎస్ఐ నరేష్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్ , చైతన్య, మహేందర్, సంతోష్ లను ఉన్నతాధికారులు అభినందించారు.






