వడగండ్లతో గాలివాన బీభత్సం
- బలమైన ఈదురుగాలులకు ధ్వంసమైన షెడ్లు
- గోడ కూలి కారుపై పడడంతో ఇద్దరు మృతి
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఘటన
దేవరకద్ర, జూన్ 17(విజయక్రాంతి) : మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో బుధవారం కురిసిన భారీ వర్షా కారణంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. వడగండ్లతో కూడిన గాలివాన ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో బలమైన ఈదురుగాలులు వీచా యి. దీంతో వారాంతపు సంతలో ఏర్పాటు చేసిన దుకాణాలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. వ్యాపారులు, కొనుగోలుదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
పోచమ్మ ఆలయం ముందు ఉన్న భారీ చెట్టు గాలివాన ధాటికి సగం నేలకొరిగి రోడ్డుపై పడింది. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు, అధికారులు చెట్టును తొలగించే పనులు చేపట్టారు. ఎస్బీఐ బ్యాంక్ ముందు విషాద ఘటన చోటుచేసుకుంది. గాలివానకు బ్యాంకు సమీపంలోని గోడ కూలి పక్కనే ఉన్న కారుపై పడింది దీంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇద్దరు మృతి చెందారు.
రైల్వే విద్యుత్ లైన్‌పై చెట్టు విరిగిపడడంతో కొంత సమయం రైలు కూడా ఆగిన పరిస్థితి నెలకొంది. మృతుల్లో ఒకరు ఇంజనీర్ కాగా మరొకరు డ్రైవర్ ఉన్నారు. గాలివాన బీభత్సంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, చెట్లు విరిగి పడటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవరకద్రలో అంగడి ఉండడంతో జనసంద్రంగా ఉన్నాయి ప్రాంతంలో ఒకేసారిగా గాలివాన బేవా సంరక్షించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.






