కిషన్‌రెడ్డి అడ్డుకున్నారనడం హాస్యాస్పదం
- సీఎం రేవంత్‌ది రాజకీయ నాటకం.. బూటకమే
- మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం
- డీపీఆర్, ప్రి ఫీజిబిలిటీ లేకుండా ప్రాజెక్టులు ఎలా మంజూరు అవుతాయి
- ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కిషన్ రెడ్డికి లేఖ
- మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మెట్రోను అట్టుకుంటున్నారనడం హాస్యాస్పదమని, కేంద్ర ప్రభుత్వం మీద కూడా తప్పు డు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. డీపీఆర్, ప్రిఫీజిబిలిటీ లేకుండా ప్రాజెక్టులు ఎలా మంజూరు అవుతాయని నిలదీశారు.
రిపోర్టులు, డీపీఆర్‌లను ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకు అభివృద్ధిపై ఆసక్తి లేదని, స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే ఆసక్తి ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రాంచందర్ రావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ విధానాలు, ఆరోపణలపై మండిపడ్డారు. రెండున్నరేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 71 సార్లు వెళ్లారని, కనీసం 15సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు.
అర్బన్ డెవలప్‌మెంట్, మెట్రో అంశాలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ని ఐదుసార్లు, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని మూడుసార్లు కలవడమే కాకుండా, హైదరాబాద్‌లో కూడా పలుమార్లు సమావేశమయ్యారని చెప్పారు. అప్పుడు ఏ సందర్భంలో కలిశారని? కిషన్ రెడ్డికి చెప్పి కలిశారా? అని నిలదీశారు. ఇప్పుడు అపాయింట్‌మెంట్ అంటూ బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు స్కాములే ముఖ్యం..
కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిపై ఆసక్తి లేదని, స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని ఎద్దేవా చేశారు. 2జీ స్కామ్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లు కాంగ్రెస్ చరిత్ర అని విమర్శించారు. కేంద్రం మెట్రో ఫేజ్- వ్యతిరేకం కాదని, ఎప్పుడూ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ‘డిలే’ (ఆలస్యం) మాత్రమేనని తేల్చిచెప్పారు.
రుణాల చెల్లింపుల కంటే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశంపై, ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించిన సలహాలు పాటించకుండా, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 2014లో దేశంలో 248 కి.మీ. మాత్రమే మెట్రో ఉండగా, అటు తరువాత 1,155 కి.మీ.లకు పెరిగిందన్నారు. రేవంత్‌వి రాజకీయ డ్రామాలని డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపించారు. కాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి, సినీ నిర్మాత బండి శ్రీనివాస్ పార్టీలో చేరడం పట్ల రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.






