ఐటీ రంగంలో మరో ముందడుగు
‘ఓజ్రిట్’ను ప్రారంభించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ‘ఓజ్రిట్’ తన నూతన కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బుధవారం ఘనంగా ప్రారం భించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ కంపెనీ నూతన లోగోను కూడా ఆవిష్కరించారు. అనంతరం ఓజ్రిట్ బృందంతో ఆయన ముచ్చటించారు.
సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ భరత్ గుప్తా, కో-ఫౌండర్ అండ్ సీఓఓ వివేకానంద రెడ్డి తదితర నాయకత్వ బృందంతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలపై చర్చించారు. తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామి టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో కేటీఆర్ చేసిన అలుపెరగని కృషిని, ఆయన దార్శనికతను ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ప్రత్యేకంగా కొనియాడారు.
ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఉపాధి కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే మాలాంటి సంస్థలు తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి వృద్ధి చెందడానికి ప్రేరణగా నిలిచాయన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సృష్టించడం, టైర్-2 (ద్వితీయ శ్రేణి) నగరాలకు మా కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సంఖ్యను 1,000 మందికి పైగా పెంచుతామని స్పష్టం చేశారు. ఈ ఐటీ ఎకోసిస్టంకు మా వంతు సహకారం అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఓజ్రిట్ సంస్థ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్, ఎంటప్రైజ్ అప్లికేషన్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు పలు రంగాల్లో వ్యాపార సంస్థలకు అత్యాధునిక సేవలు అందిస్తోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ తమ క్లయింట్లకు సేవలు అందిస్తూ, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా సంస్థల వేగవంతమైన వృద్ధికి తోడ్పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.






