సీపీఎస్ రద్దు ఎప్పుడు?
ఓపీఎస్ కోసం ఏళ్ల తరబడి 2.60 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరీక్షణ మాటనిలుపుకోని కాంగ్రెస్ పార్టీ
ఓపీఎస్ లేకపోవడంతో సామాజిక, ఆరోగ్య భద్రత కరువు
దేశంలోని పలు రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసిన ప్రభుత్వాలు
పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్న సీపీఎస్ ఉద్యోగులు
* కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)తో ఉద్యోగ, ఉపాధ్యాయుల బాధలు అన్నీ ఇన్నీ కావు. జీవిత చరమాంకంలో సామాజిక భద్రత ఉండడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆరోగ్య భద్రత కూడా ఉండటంలేదని వారు వాపోతున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయా లని ఏళ్ల తరబడిగా అడుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలుచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులంతా అప్పు డు సంబరపడ్డారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఇచ్చిన హామీని అటకెక్కించడంతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే వారంతా పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): 2004 నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. అంటే 2004 సెప్టెంబర్ 1, ఆ తర్వాత నియమాకమైన ఉద్యోగులు సీపీఎస్ పరిధిలోకి వస్తారు. వీరు పాత పెన్షన్ స్కీం కిందకు వర్తించరు. రాష్ట్రం లో సీపీఎస్ ఉద్యోగులు 2.60 లక్షల మంది వరకు ఉంటా రు. వీరికి ఓపీఎస్ పెన్షన్ వర్తించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక ఉద్యోగి లేదా టీచర్ తాను రిటైరయ్యే నెలలో బేసిక్‌లో ఒక లక్ష రూపాయ లు జీతం పొందితే.. ఆ ఉద్యోగికి పాత పెన్షన్ విధానంలో నెలకు రూ.50 వేల వరకు వస్తుంది.
అదే ఒక సీపీఎస్ ఉద్యోగి తన రిటైరయ్యే నెలలో రూ.60 వేలు వేతనం పొం దితే ఆ ఉద్యోగికి వస్తున్న పెన్షన్ దాదాపు రూ.5400 మాత్రమే. దీంతోనే రోగం, నొప్పి, తన అవసరాలు అన్నీ తీర్చుకోవాల్సి ఉంటుంది. ముసలితనంలో ఈ పెన్షన్‌తోటి తాము ఎలా బతుకీడ్చాలని రిటైరైన సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా 20, 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన సీపీఎస్ ఉద్యోగికి వస్తున్న సర్వీస్ పెన్షన్ చాలా తక్కువగా ఉండటంతోనే సీపీఎస్ ఉద్యోగులంతా దాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానం అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ ప్రభుత్వం మాత్రం తమ రోదనను పెడచెవిన పెడుతున్నదని ఉద్యోగులు అంటున్నారు. పెన్షనే కాదు.. వీరికి రిటైరైన తర్వాత ఆరోగ్య భద్రత కూడా పెద్దగా ఉండటంలేదు. రాష్ట్రంలో మొత్తం 3.69 లక్షల మంంది ఉద్యోగులుంటే అందులో 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులే. ఇక ఓపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం వారి మూల వేతనం నుంచి 1.5 శాత నిధులు కట్ చేసుకుని వారికి క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించనుంది.
కానీ అదే సీపీఎస్ ఉద్యోగులకు, రిటైరైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సర్వీసులో ఉన్నని రోజులు మాత్రమే క్యాష్ లెస్ వైద్యాన్ని అందిస్తామని, రిటైరైతే తాము అందించబోమని పేర్కొంటుంది. ఆతర్వాత తమకు ఆరోగ్య భద్రత ఎలా అని రిటైరైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పక్క రాష్ట్రాల్లో అమలు..
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసిన ప్రభుత్వాలు తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీపీఎస్‌ను రద్దుచేశారు. పంజాబ్‌లోనూ రద్దు చేశారు. కర్ణాటకలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయడంలేదని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు నిలదీస్తున్నారు.
ఉద్యోగి ఆర్థిక భద్రత స్టాక్ మార్కెట్‌లో పెట్టడమేంటి?
సీపీఎస్ అనేది కేవలం ఉద్యోగి చందా ఆధారిత స్కీం మాత్రమే. ఈ పథకంలో ఉద్యోగుల మూల వేతనం నుంచి ప్రతి నెలా 10 శాతం చొప్పున కట్ చేస్తారు. ప్రభుత్వం కూడా మరో 10 శాతం చందాను జమచేస్తోంది. ఈమెత్తాన్ని ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టం) ట్రస్టులో పెడతారు. ఇలా ప్రతి నెల రూ.400 కోట్లు షేర్‌మార్కెట్‌లో పెడతారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను బట్టే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. రిటైర్‌మెంట్ తర్వాత లభించాల్సిన ఆర్థిక భద్రతను అంతర్జాతీయ మార్కెట్ చేతుల్లో పెట్టడం సరికాదు.
ఇంత భారీ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల లాభనష్టాలకు తాకట్టు పెట్టడం ఉద్యోగులను మోసం చేయడమే. ఇరాన్ అమెరికా యుద్ధ్దం జరిగినప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోవడంతో ఒక్కో సీపీఎస్ ఉద్యోగి తమ రిటైర్‌మెంట్ నిధులను రూ.40 వేల నుంచి రూ.2 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలి. సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ ఏరియర్స్ ఏప్రిల్ 2025 నుంచి చెల్లించడంలేదు. ప్రభత్వుంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే నెలలో జనజాగరణ యాత్ర, ఆగస్టులో ధర్నాను చేపట్టబోతున్నాము.
స్థితప్రజ్ఞ, తెలంగాణ
స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు






