18 June, 2026 | 2:54 AM

ప్రభుత్వ స్కూళ్లలో చదువు నామోషీ కాదు

18-06-2026 01:33 AM

మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటు

తెలంగాణను విద్యారంగంలో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

ఆరుట్ల టీపీఎస్ రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం: సీఎం రేవంత్‌రెడ్డి

రంగారెడ్డి, జూన్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం నామోషీ కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను (టీపీఎస్) ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణను విద్యారంగంలో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా ఆరు ట్ల గ్రామంలో రూ.15 కోట్లతో అత్యధిక వసతులతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం ప్రారంభించి, రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదని ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే నిర్మితమవుతోందని ఘంటాపథంగా చెప్పారు. 

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విధ్వంసమైన విద్యావ్యవస్థను తిరిగి వికాసం వైపు నడిపించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా, నాణ్యమైన యూనిఫామ్స్, విద్యా కిట్లను అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందన్నారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ డిగ్రీలు మాత్రమే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన అత్యాధునిక భవనాన్ని ఈ ఏడాది డిసెంబరు 9న ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ‘గత ప్రభుత్వంలో యూనిఫాంలు ఇస్తే.. అవి నెలరోజులకే చిరిగాయి.

ఈ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్ ఇస్తోంది. విద్యాకిట్ల పంపిణీ కోసం రూ.680 కోట్లతో టెండర్లు పిలిచాం. రూ.680 కోట్ల టెండర్లలో రూ.3వేల కోట్ల స్కామ్ జరిగిందని ఒకాయన అంటున్నారని.. అది ఎలా సాధ్యమో చెప్పాలి’ అని పరోక్షంగా బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి హరీశ్‌రావులపైన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని విమర్శించే వారికి ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక సమాధానమని సీఎం అన్నారు.

‘ప్రస్తుతం డ్రగ్స్, గంజాయి మహమ్మారి సమాజాన్ని పట్టిపీడిస్తోంది. విద్యార్థులు, యువత స్నేహితుల ప్రభావంతో ఈ దురలవాట్ల బారిన పడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ఈ నెల 19వ తేదీన ఎల్బీ స్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నాం’ సీఎం తెలిపారు. 

ప్రభుత్వ బడికి నో అడ్మిషన్ బోర్డు 

సాధారణంగా కార్పొరేట్ స్కూళ్లలో కనిపించే నో అడ్మిషన్ బోర్డు నేడు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో దర్శనమిచ్చిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో నమ్మకం పెంచిన అక్కడి ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ప్రకటించారు. విద్యా కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామన్నారు.

‘ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఎందరో గొప్ప నాయకులుగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగారు. దేశ గమనాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవి నరసింహారావు ప్రభుత్వ బడిలోనే చదివారు. నేనూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాడినే. ఇక్కడి నుంచి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరాను’ అని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. విద్యార్థులంతా బాగా చదువుకుని, ఐఏఎస్, ఐపీఎస్‌లుగా, రాజకీయ నాయకులుగా ఎదిగి తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలని పిలుపునిచ్చారు.

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలి

భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో తెలంగాణ విద్యార్థులు పతకాలు సాధించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. 2034లో ఒలంపిక్స్‌లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ సాధించే విధంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే.. క్రీడాస్ఫూర్తిని కలిగించాలనే ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తీసుకువచ్చి విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడించామన్నారు.

ఒలంపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ ను చాట్ ఎందుకు మేం క్రీడలను ప్రోత్సహించేందుకు మెస్సీని తీసుకువస్తే ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయ విమర్శలు చేశాయాన్నారు. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేసే వాళ్లకు భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా మిగలదు అని సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆరుట్ల గొప్పతనం..

‘పబ్లిక్ స్కూల్‌ను ఆరుట్లలో ప్రారంభించాలని ఎందుకు వచ్చినా అంటే.. ఆరుట్ల ప్రజలు తెలంగాణకు స్ఫూర్తినిచ్చిర్రు, ఆదర్శంగా నిలబడ్డరు’ అని సీఎం ఈ ప్రాంతాన్ని కొనియాడారు. నాడు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి, సాయుధ పోరాటానికి స్ఫూర్తిని నింపిన ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి పూర్వికులది ఇదే గ్రామమని గుర్తుచేశారు. తెలంగాణ నలుమూలలా ఆరుట్ల గొప్పతనం తెలుసని కీర్తించారు. ఆ స్ఫూర్తితో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ని ఏర్పాటు చేశామని తెలిపారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా, విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి పాల్గొన్నారు. 

పూరీలు చేసి.. ఫుట్‌బాల్ ఆడి

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులతో కలిసి వినూత్నంగా గడిపారు. మొదట కిచెన్ సిబ్బంది వద్దకు వెళ్లిన ఆయన, వారితో కలిసి స్వయంగా పూరీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత విద్యార్థుల పక్కన కూర్చొని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) చేశారు.

కేవలం వంటకానికే పరిమితం కాకుండా, స్కూల్లోని మ్యూజిక్ రూంను సందర్శించి స్వయంగా గిటార్ వాయించారు. అనంతరం స్కూల్ ప్లే గ్రౌండ్లోకి దిగి విద్యార్థులతో కలిసి కాసేపు ఉత్సాహంగా ఫుట్బాల్ ఆడారు. ప్రీ-ప్రైమరీ విభాగాలను, పాఠశాల లైబ్రరీ, తరగతి గదులు, ఇన్నోవేషన్ ల్యాబ్, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబ్స్ ను సందర్శించి సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.