18 June, 2026 | 3:17 AM

పడకేసిన ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’!

18-06-2026 02:08 AM

నిలిచిన కీలక పరీక్షలు.. ఖాళీ అయిన కిట్లు

ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న రోగులు

శాంపిల్స్ తీసుకున్నా రిపోర్టుల కోసం పడిగాపులు

పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం 

సంగారెడ్డి, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య పరీక్షలు అందించే లక్ష్యంతో ప్రారంభమైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లు ప్రస్తుతం తీవ్ర నిధుల కొరత, సిబ్బంది కొరతతో పాటు సప్లయర్ల బకాయిల వల్ల పడకేసాయి. దీంతో నిరుపేద రోగులు సాధారణ పరీక్షల కోసం కూడా ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తూ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా డయాగ్నస్టిక్ కిట్లు, సర్జికల్ వస్తువులు సరఫరా చేసే ప్రైవేట్ వెండర్లకు ప్రభుత్వం దాదాపు రూ.140 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని సమాచారం. సుదీర్ఘ కాలంగా బకాయిలు పేరుకుపోవడంతో ల్యాబ్ కిట్లు, కెమికల్స్ (రీఏజెంట్స్) సరఫరాను ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ దాదాపు 90 శాతం మేర నిలిపివేసింది.

రోగనిర్ధారణకు సంబంధించిన కీలకమైన బడ్జెట్ హెడ్ కింద నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల ఈ ల్యాబ్‌ల నిర్వహణ కష్టతరంగా మారిందనే ఆరోపణలు ఉన్నా యి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ దాదాపు 32 ప్రధాన జిల్లా హబ్ ల్యా బ్‌లను మంజూరు చేయగా, అందులో 20 నుంచి 28 వరకు వివిధ జిల్లాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ హబ్లకు అనుసంధానంగా రాష్ట్రవ్యాప్తంగా 435 కంటే ఎక్కువ స్పోక్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల పనితీరుపై విజయక్రాంతి ప్రత్యేక కథనం.. 

ల్యాబ్‌ల పనితీరు క్షేత్రస్థాయి వాస్తవాలు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి జిల్లా హబ్‌లకు పంపే ఈ మోడల్, రవాణా, ల్యాబ్ నిర్వహణ లో పాల వల్ల మందగించింది. ఉచితంగా 134 రకాల పరీక్షలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, చాలా జిల్లాల్లో ల్యాబ్ కిట్లు లేక కేవ లం 30 నుండి 40 రకాల ప్రాథమిక పరీక్షలకే పరిమితమవుతున్నారు. నిరంతరాయం గా 24 గంటల పాటు సేవలు అందించడంలోనూ ల్యాబ్లు విఫలమవుతున్నట్లు సీఏజీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజిస్టులు, మైక్రో బయాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బందికి కూడా కొన్ని నెలల పాటు వేతనాలు అందకపోవడంతో వారు విధులకు సరిగ్గా హాజరుకావడం లేదు. కాగా ప్రభుత్వ ల్యాబ్‌ల్లో థైరాయిడ్, డెంగ్యూ, కల్చర్ అండ్ సెన్సిటివిటీ, క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి కీలక పరీక్షలకు కిట్లు అందుబాటులో లేకపోవడంతో పేదలు వేలాది రూపాయలు వెచ్చిం చి ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సప్లయర్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, డయాగ్నస్టిక్ సెంటర్లలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేసి, ల్యాబ్ కిట్ల నిరంతర సరఫరాకు శాశ్వత నిధిని ఏర్పాటు చేస్తేనే ఈ ప్రతిష్టాత్మక పథ కం పేదలకు పూర్తిస్థాయిలో రీచ్ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

ఆరోగ్య మంత్రి ఇలాఖాలో కూడా..  

ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.  మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లోని హబ్ ల్యాబ్‌ల నిధుల కొరత, రీఏజెం ట్లు (కెమికల్స్) లేక వెలవెలబోతుంటే, ప్రైవే ట్ ల్యాబ్‌లు మాత్రం రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉన్న డయాగ్నస్టిక్ హబ్లలో గతంలో 57 నుంచి 134 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం సీబీపీ, షుగర్ వంటి 20 నుంచి 30 సాధారణ పరీక్షలకే పరిమితమయ్యారు.

గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్, కాలేయ పరీక్షలకు సంబంధించిన కెమికల్ కిట్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ల్యాబ్ టెక్నీషియన్లు శాంపిల్స్ తీసు కోవడమే బంద్ పెట్టారు. నర్సాపూర్, తూ ప్రాన్, చేగుంట, గజ్వేల్, నారాయణ్ఖేడ్, జహీరాబాద్ వంటి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రాలకు పంపే వాహనాల రాకపోకలు సక్రమంగా సాగడం లేదు. శాంపిల్స్ సేకరించినప్పటికీ, జిల్లా హబ్ల నుండి ఆన్లైన్లో రిపోర్టులు జనరేట్ కావడానికి 3 నుండి 5 రోజులు పడుతోంది. దీంతో విసుగు చెందిన గ్రామీణ రోగులు స్థానిక ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.



ఎలాంటి ఇబ్బంది లేదు: 

లలితాదేవి, డీఎంహెచ్వో, 

సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. పీహెచ్సీల నుంచిడి వచ్చే నమూనాలను త్వరితగతిన రిపోర్టులు అంది స్తున్నాం. ఎక్కడ కూడా సిబ్బంది కొరత లేదు. 134 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నాం. రీఏజెంట్ల సమస్య కూడా లేదు. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నాం.