18 June, 2026 | 3:18 AM

రైతులందరికీ న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

18-06-2026 02:07 AM

మహబూబ్ నగర్, జూన్ 17 (విజయ క్రాంతి) : ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి నిర్వాసిత రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు పాల్గొని రైతుల సమస్యలను విని, వారికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల పరిహారం పొందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటివరకు 90 నుంచి 95 శాతం నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాస ప్యాకేజీలు అందించా మని, మిగిలిన అర్హుల సమస్యలను కూడా మానవతా దృక్పథంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కేసును మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి, అర్హులైన వారికి పరిహారం అందజేస్తామని తెలిపారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు మాట్లాడుతూ ఇటీవల సోమశిలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న అన్ని కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందజేస్తామని తెలిపారు. నిర్వాసిత రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, పునరావాస కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె . ఎల్. బి హరిప్రియ, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, ఆర్.డి.ఓ నవీన్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.