18 June, 2026 | 2:34 AM

దొడ్డు బియ్యం విక్రయం పారదర్శకమే

18-06-2026 01:13 AM
  1. కుంభకోణంగా చిత్రీకరణ.. పూర్తిగా దురుద్దేశం
  2. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ

హైదరాబాద్, జూన్ 17: కొన్ని దినపత్రికలలో ప్రచురితమైన ‘దొడ్డుబియ్యం మాఫియా దందా’ శీర్షికతో వచ్చిన కథనం పూర్తిగా ఆధార రహితమైనది, వాస్తవాలకు విరుద్ధమైనదని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (టీజీఎస్‌సీఎస్‌సీఎల్) స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల మేరకు, క్యాబినెట్ ఆమోదంతో, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ వేదికగా నిర్వహించిన మిగులు దొడ్డు బియ్యం విక్రయ ప్రక్రియను కుంభకోణంగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యమని పేర్కొంది.

ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగులుగా నిల్వ ఉందని సంస్థ తెలిపింది. దీర్ఘకాలం నిల్వ ఉంచితే నాణ్యత క్షీణించడం, గిడ్డంగుల కొరత, అదనపు వ్యయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విక్రయ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది.

విక్రయ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ ద్వారా నిర్వహించామని, ఎలాంటి నామినేషన్లు, ప్రాధాన్యత కేటాయింపులు లేదా రహస్య ఒప్పందాలకు తావులేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి బిడ్డర్‌కు సమాన అవకాశాలు కల్పించామని పేర్కొంది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన రూ.21.60 కిలో (రూ.21,600 టన్ను) రిజర్వ్ ధర కంటే ఎక్కువగా టన్నుకు రూ.21,700 ధర లభించిందని, ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరలకు విక్రయించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సంస్థ వెల్లడించింది.

సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వల మొత్తం విలువే సుమారు రూ.303 కోట్లు మాత్రమే ఉంటుందని, అలాంటి నిల్వలపై ‘వేల కోట్ల నష్టం’ అన్న వాదనకు ఎలాంటి గణాంక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వేలంలో విజయం సాధించిన సంస్థలు ఒప్పందాలు, సెక్యూరిటీ డిపాజిట్లు పూర్తి చేసినప్పటికీ పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, ఒక్క గింజ కూడా విడుదల కాలేదని సంస్థ వివరించింది.