18 June, 2026 | 3:19 AM

కంటోన్మెంట్ బడ్జెట్ 317 కోట్లు

18-06-2026 02:11 AM

ఆమోదం తెలిపిన బోర్డు 

సమావేశానికి హాజరైన ఎంపీ ఈటల

సికింద్రాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.317 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు కంటోన్మెంట్ సీఈఓ అర్వింద్ కుమార్ వెల్లడించారు. బుధవారం కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సమావేశంలో కంటోన్మెంట్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్‌తో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. బడ్జెట్ వివరాలను సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది వెల్లడించారు. పన్నుల రూపంలో రూ.43 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.47 కోట్లు లభిస్తాయని తెలిపారు.

15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.15 కోట్లు, రక్షణ శాఖ పరిధిలోని సంస్థల నుంచి సర్వీస్ చార్జీల రూపంలో రూ.53 కోట్లు, మిలిటరీ కన్జర్వెన్సీ ద్వారా రూ.42 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రూ.38 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం అభ్యర్థించినట్లు, అందులో రూ.30 కోట్లు ప్రత్యేక గ్రాంట్ కింద ఉన్నాయని తెలిపారు. రోడ్ల అభివృద్ధి కోసం అదనంగా రూ.20 కోట్ల నిధులను కోరినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కంటోన్మెంట్ పరిధిలో పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

అలాగే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి పరిహారంగా లభించిన రూ.316 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూడా బోర్డు ఆమోదం తెలిపినట్లు అరవింద్ కుమార్ ద్వివేది వెల్లడించారు. మడ్‌ఫోర్ట్ సమీపంలోని బీ-4 స్థలంలో గుడిసెలను తొలగించే ప్రతిపాదన లేదని, రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగిస్తామని ద్వివేది చెప్పారు.

బోయిన్‌పల్లి సర్వే నంబర్ 157/1 పరిధిలోని 8 ఎకరాల భూమికి హైకోర్టు ఆదేశాల మేరకే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని తెలియజేశారు. ఆ భూమి యాజమాన్య హక్కుల అంశంలో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ సీఈవో పనితీరుపై ఎంపీ ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో సమగ్ర అభివృద్ధిని  చేస్తున్నామని పేర్కొన్నారు.