ఐఐఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆర్థిక సాయం
స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ
కల్లూరు, జూలై 9 (విజయక్రాంతి): కల్లూరు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాసర ఐఐఐటీలో సీట్లు సాధించిన నలుగురు విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ధాతల సహకారంతో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రమణ శివనందిని,షేక్ ఫరీదా, కోరుట్ల జోసాత్విక, మోదుగు రాంచరణ్ లకు ఆర్థిక సహాయం అందించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ దారవత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ పేద కుటుంబాలలో జన్మించిన విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి ఐఐఐటీ సీట్లు సాధించడం గర్వకారణమని అన్నారు. అదేవిధంగా ఏఎంసి చైర్మన్ భాగం నీరజ మాట్లాడుతూ మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, ప్రతి రంగంలో ముందుండాలని సూచించారు. సమాజంలో బాలికలపై జరుగుతున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యార్థిని తనను తాను రక్షించుకునే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి ఉబ్బన బాబురావు మాట్లాడుతూ పేదరికం కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ వేదికగా నిలిచి ఆర్థిక సహాయం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే విద్యా సంవత్సరంలో కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఐఐఐటి సీట్లు సాధించిన ప్రతి విద్యార్థికి ఇదే విధంగా సహాయం అందించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మండల విద్యా అధికారి,పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి,కౌన్సిలర్ యాస నాగమణి శ్రీకాంత్,ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఉబ్బన బాబురావు,జే.రామకృష్ణ,కె. వెంకటేశ్వర్లు,యు.వేణుబాబు, కృష్ణ, ఎం.వెంకటేశ్వరావు,ఎస్కే ముజీమ్,ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






