10 July, 2026 | 1:49 AM

నేడే రైతు ఆశీర్వాద సభ

10-07-2026 12:03 AM
  1. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు
  2. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
  3. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల

ఖమ్మం, జూలై 9 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురం (మత్కెపల్లి క్రాస్ రోడ్) వద్ద శుక్రవారం రైతు ఆశీర్వాద సభ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గత నెల 30న జరగాల్సిన బహిరంగ సభ వర్షం కారణంగా తాత్కాలికంగా వాయిదా వేశారు. తిరిగి శుక్రవారం ఏర్పాటు చేయగా, జిల్లా యం త్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర్, సీపీ సునీల్ దత్‌తో కలిసి కార్యక్రమ ప్రాంగణాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. రైతు మేళా స్టాళ్లు, ప్రధాన వేదిక, భోజనశాలలు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రజల రాకపోకల మార్గాలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య ఏర్పాట్లు, వైద్య శిబిరాలు, విద్యుత్, సమాచార కేంద్రాలు తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. రైతులను, ప్రజలను, పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5లక్షల మంది సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా, మండలానికి ఒక ఇంచార్జ్‌లను నియమించారు. 

భారీగా ఏర్పాట్లు

సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సభా స్థలాన్ని, మీటింగ్ ప్రాంగణాన్ని అన్ని రకాలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ సునిల్ దత్ ఆధ్వర్యంలో భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా వేదికకు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.