వరదను ఒడిసి పట్టండి
- మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టులను ప్రారంభించాలి
- హైడ్రాలిక్ పద్ధతిలో లిఫ్టులు నడపడం సురక్షితమేనని స్పష్టం
- ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్ల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, జులై 9 (విజయక్రాం తి): వరద నీటిని ఒడిసిపట్టండని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టులను వెంట నే ప్రారంభించాలని ప్రభుత్వానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో ప్రస్తుత ఎల్-నినో ప్రభావం వల్ల రుతుపవన వర్షాలు ఆశించినస్థాయిలో కురవడం లేదని, ఫలితంగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 16 నుంచి 46 శాతం వరకు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సంక్షోభ సమయంలో రైతాంగాన్ని, పంటలను కాపాడటానికి ప్రాణహిత నదిలో అందుబాటులో ఉన్న వరద ప్రవాహాలను తక్షణమే వినియోగించుకోవాలని సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎం.శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు జీ దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, అసోసియేట్ ప్రెసిడెంట్ డీ సాంబయ్య ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టు ల పునరుద్ధరణ, వినియోగంపై వారు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ జలాశయ కనిష్ఠ డ్రా-డౌన్ స్థాయి (ఎండీడీఎల్) +93.500 మీటర్లు కాగా, ప్రస్తు తం గేట్లు పూర్తిగా తెరిచి ఉన్నప్పటికీ ప్రాణహిత వరద నీటి మట్టం సుమారు +97.500 మీటర్లుగా ఉంది. ఈ అనుకూల హైడ్రాలిక్ స్థితి ఆధారంగా కన్నెప ల్లి పంప్ హౌస్ ద్వారా రోజుకు సుమా రు 3 టీఎంసీల నీటిని సులభంగా లిఫ్ట్ చేయవచ్చు.
నీటి సరఫరా సాఫీగా సాగడానికి అన్నారం బ్యారేజీని +116.500 మీటర్లు, సుందిల్ల బ్యారేజీని +126.500 మీటర్ల కనిష్ఠ డ్రా-డౌన్ (ఎండీడీఎల్) స్థాయిల వద్దే నిర్వహించాలని కోరింది. ఈ పరిమితుల్లో ఉంచడం వల్ల బ్యారేజీలు సురక్షితంగా ఉండటమే కాకుండా, మూడు పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేస్తాయని వివరించారు.
ఒకవేళ అన్నారం (5.1 టీఎంసీ), సుందిల్ల (3.78 టీఎంసీ) బ్యారేజీలు ఒకేసారి ప్రమాదానికి గురైనా, ఆ మొత్తం 8.8 టీఎంసీల నీరు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ప్రవహించి పోతుందని విశ్రాంత ఇంజినీర్లు లెక్కలతో తెలి పారు. గత అనుభవా ల ప్రకారం ప్రాణహిత నదిలో 10 లక్షల క్యూసెక్కుల కం టే ఎక్కువ వరద వచ్చినప్పుడే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదా ఊర్ల ముంపు జరగలేదని, ప్రస్తుత పద్ధతిలో లిఫ్టులు నడపడం అత్యంత సురక్షితమని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ తరఫున తమ సాంకేతిక సేవలను స్వచ్ఛందంగా, ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.






