10 July, 2026 | 1:45 AM

ఒలింపిక్స్ నా డ్రీమ్

10-07-2026 12:46 AM

హైదరాబాద్ వేదిక కావాలి.. ఆ లక్ష్యంతోనే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ

  1. క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు పారితోషికాలు 
  2.   2028 డిసెంబర్ నాటికి స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభం
  3. వెయ్యి కోట్లతో ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ: సీఎం రేవంత్‌రెడ్డి 
  4. పీటీ ఉషతో కలిసి ‘ఇపేస్’ లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ

శేరిలింగంపల్లి, జూలై 9 (విజయక్రాంతి): ‘గత 20 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించలేదు. 1990-2004 మధ్య హైదరాబాద్ చాలా ప్రతిష్ఠాత్మక ఈవెంట్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా, అందులో హైదరాబాద్ కూడా ఒక వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నాను. మహానగరంలో ఒలింపిక్స్ నిర్వహించాలనేది నా డ్రీమ్’ అని ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటుచేసిన యంగ్ ఇండి యా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఇపేస్) లోగో, వెబ్‌సైట్‌ను గురువారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, అథ్లెట్ పీటీ ఉషతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు తనను కలిసిన పీటీ ఉషను సీఎం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతను దేశ సంపదగా అభివర్ణిస్తూ, అంతర్జాతీయ క్రీడా యవనికపై తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టంచేశారు.

ప్రపంచ దేశాలతో పోల్చితే ఒలింపిక్స్‌లో భారత్ అత్యంత వెనుకబడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాలకు క్రీడల పట్ల ఒక నిర్దిష్టమైన విధానం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని విమర్శించారు. సరైన ప్రోత్సాహం లేకపోయినా పీటీ ఉష లాంటి కొద్దిమంది క్రీడాకారులు తమ సొంత ప్రతిభతో దేశానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చారని గుర్తు చేశారు. అయితే, ప్రపంచ దేశాల సరసన భారత్‌ను ఇంకా ఒక క్రీడా శక్తిగా గుర్తించడం లేదని, ఆ లోటును భర్తీ చేయడానికే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని సీఎం ప్రకటించారు.

ప్రభుత్వ, -ప్రైవేట్ భాగస్వామ్యంతో యూనివర్సిటీ..

క్రీడారంగంలో అత్యుత్తమ ప్రమాణాలు, శిక్షణ అందించేందుకు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వ, -ప్రైవేట్ (పీపీపీ) విధానంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ శివారులోని ఫోర్త్ సిటీలో రూ.వెయ్యి కోట్లతో అంతర్జాతీయ సదుపాయాలతో ఈ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్రీడల్లో రాణించడం వల్లే పీటీ ఉషకు దేశవ్యాప్త గుర్తింపు లభించిందని, ఆ ప్రతిభే ఆమెను నేడు రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేర్చిందని చెప్పారు. విద్యార్థులు ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలని వివరించారు. క్రీడాకారులు తమ లక్ష్యాన్ని ముద్దాడాలంటే వంద శాతం కష్టపడాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.

2028 డిసెంబర్ నాటికి స్పోర్ట్స్ అకాడమీ

రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం.. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ సంకల్పమన్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం వెల్లడించారు. క్రీడలను జీవితంగా ఎంచుకునే యువతకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

క్రీడల్లో అత్యుత్తమంగా రాణించేవారికి కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ సిరాజ్‌కు విద్యార్హతతో సంబంధం లేకుండా గౌరవప్రదమైన డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు భారీ నగదు పారితోషికాలు ఇచ్చి ప్రోత్సహిస్తామని, ఉద్యోగాల బాధ్యతను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్, ఇపేస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జీ కిషోర్, సతగ్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాకారులు, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీతలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.