10 July, 2026 | 1:46 AM

నన్ను ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

10-07-2026 12:42 AM
  1. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణికి రూ.30 వేల కోట్ల బకాయిలు
  2. కాంగ్రెస్ మరో రూ.24వేల కోట్ల పెండింగ్
  3. తెలంగాణ బిడ్డగా బొగ్గు బ్లాక్ తెస్తే.. విమర్శిస్తారా
  4. విద్యుత్ అంతరాయం రాకూడదనే సింగరేణికి తాడిచర్ల-2 బ్లాక్
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): సింగరేణి విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్‌ఎస్ పార్టీకి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా వాడుకుని రూ.30 వేల కోట్ల బకాయిలు పెట్టి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో మరో రూ.24 వేల కోట్ల బకాయిలను పెంచిందని విమర్శించారు.

ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్‌లో ఉంటే సంస్థ ఎలా మనుగడ సాగిస్తుం దని, కార్మికులకు ఏ రకంగా ధైర్యం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిడ్డగా ఎంతో కష్టపడి, లీగల్ ఓపీనియన్లు తీసుకొని బొగ్గు బ్లాక్ తెస్తే అభినందించాల్సింది పోయి, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనను విమర్శించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

గత బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణలో రెండు బొగ్గు బ్లాకులు వస్తే వాటిని సింగరేణి కార్మిక సంస్థకు ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టుకు కట్టబెట్టారని విమర్శించారు. గత యూపీఏ (కాంగ్రెస్) ప్రభుత్వ హయాం లో జరిగిన ‘కోల్’ కుంభకోణం వల్లే సుప్రీంకోర్టు దేశంలోని అన్ని బొగ్గు గనుల కేటా యింపులను రద్దు చేసి, పారదర్శక వేలం విధానాన్ని అమల్లోకి తెచ్చిందని, ఈ నిబంధనలు మోదీ ప్రభుత్వం తెచ్చినవి కావని గుర్తుచేశారు.

సింగరేణి కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో లేని ఈ గొప్ప సంపదను కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసికట్టుగా ముందుకు రావాలనిన్నారు. సింగరేణి కష్టకాలంలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి సంస్థ హితం కోసమే ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఇంధన భద్రతకు భరోసా

ఒడిశాలో తెలంగాణ జెన్కోకు క్యాప్టివ్ మైన్‌గా కేటాయించిన ‘నైనీ కోల్ బ్లాక్’ అనుమతులను 2015 నుంచి అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిలిపివేసిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఇటీవల ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, తాను వ్యక్తిగతంగా అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడి, అన్ని రకాల పర్యావరణ, ఇతర క్లియరెన్సులు ఇప్పించానని చెప్పారు. ప్రస్తుతం నైనీ బ్లాక్‌లో ఓవర్ బర్డన్ తొలగించి, విజయవంతంగా ట్రయల్ ప్రొడక్షన్ (బొగ్గు ఉత్పత్తి) ప్రారంభించడం సింగరేణి సాధించిన గొప్ప విజయమన్నారు.

సింగరేణి పరిధిలో ప్రస్తుతం ఉన్న బ్లాక్లన్నింటిలో కెల్లా అత్యంత భారీ నిల్వలు ఉన్న గని తాడిచర్ల- అని ఆయన వివరించారు. గతంలో సత్తుపల్లి లోని జీవీఆర్ ఓపెన్ కాస్ట్ 227 మిలియన్ టన్నులతో పెద్ద బ్లాక్‌గా ఉండేదని, కానీ ఇప్పుడు వచ్చిన తాడిచర్ల--2 లో 434 మిలియన్ టన్నుల అత్యంత నాణ్యమైన గ్రేడ్-8, గ్రేడ్-9 రకానికి చెందిన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు.

తాడిచర్ల గని ద్వారా ఏటా సగటున 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినా రాబోయే 45 సంవత్సరాల పాటు సింగరేణికి, తెలంగాణ ఇంధన భద్రతకు లాంగ్ టర్మ్ భరోసా లభిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే 40 ఏళ్లలో ఈ రెండు బ్లాక్‌ల ద్వారా సింగరేణికి సుమారు రూ.2,25,000 కోట్ల భారీ టర్నోవర్ సమకూరుతుందని వెల్లడించారు. ఇందులో తాడిచర్ల ద్వారా రూ. 1.50 లక్షల కోట్లు, నైనీ బ్లాక్ ద్వారా రూ. 75 వేల కోట్ల టర్నోవర్ లభిస్తుందన్నారు. 

బకాయిలు చెలించాలి

తాడిచర్ల గనిలో 100 శాతం సింగరేణి కార్మికుల శ్రమనే వినియోగిస్తూ, 2,000 మందికి పైగా కార్మికులకు 45 ఏళ్ల పాటు శాశ్వత ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ రెండు బ్లాకుల ద్వారా కొత్తగా 3,500 మందికి నూతన ఉద్యోగాలు లభిస్తాయని, రైల్వే నెట్‌వర్క్, నూతన రహ దారులు వంటి మౌలిక వసతులు పెరుగుతాయని స్పష్టం చేశారు. సింగరేణి ఆర్థిక సంక్షోభంపై దృష్టి పెట్టాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

కార్మికులు ప్రాణాలకు తెగించి రాత్రింబగళ్లు కష్టపడి తీసిన బొగ్గుకు సంబంధించిన రూ.54,148 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి వెంటనే చెల్లించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో సింగరేణి సొంత థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకున్న విద్యుత్‌కు గాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.28,876 కోట్లని పేర్కొన్నారు. తెలంగాణ జెన్కో సంస్థలు సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గుకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25,272 కోట్లుగా ఉన్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. 

సింగరేణి రక్షణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికి ఇంధన ఊపిరిగా, ఇక్కడి ప్రజల గుండె చప్పుడుగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ మనుగడే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఈ రోజు సింగరేణి సంస్థ ద్వారా సుమారు 75 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. దక్షిణ భారతదేశంలో విద్యుత్, సిమెంట్, స్టీల్ ఉత్పత్తికి బొగ్గు అత్యంత కీలకమన్నారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున సకాలంలో బొగ్గు సరఫరా కాకపోతే తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

భవిష్యత్‌లో అలాంటి అంతరాయం రాకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ చట్టపరమైన నిబంధనలను ఉపయోగించారని తెలిపారు. తాడిచర్ల--2 కోల్ బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కార్మిక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సంఘాలు, అధికారులు, ఇంజనీర్స్ అసోసియేషన్లు, జీఎంల ఆర్గనైజేషన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేల విజ్ఞప్తులను తాను మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోనే ఈ సానుకూల నిర్ణయం జరిగిందన్నారు.