10 July, 2026 | 3:07 AM

న్యాయవాదిపై అక్రమ కేసు

10-07-2026 01:35 AM

రెండు రోజులు విధులు బహిష్కరించిన దమ్మపేట బార్ అసోసియేషన్ 

దమ్మపేట, జూలై 9, (విజయక్రాంతి): సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం చేసుకోవద్దని ఉన్నత న్యాయస్థానాలు చెబుతున్నప్పటికీ, పోలీసుల తీరు మారడం లేదని దమ్మపేట న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.

దమ్మపేట రెవెన్యూ మౌజా పరిధిలోని 273/1 సర్వే నంబర్లో సివిల్ వివాదం కోర్టులో నడుస్తున్నప్పటికీ, పోలీసులు అనవసరంగా తలదూర్చడమే కాకుండా, న్యాయవాది గోళ్ల భవాని కృష్ణ యాద్ప అక్రమంగా కేసు బనాయించడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పోలీసుల తీరుకు నిరసనగా గురు, శుక్రవారాలు కోర్టు విధులను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదులు ప్రకటించారు.  దమ్మపేటలోని జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు.

సాధారణంగా ఏదైనా సివిల్ వివాదం లేదా సివిల్ నేచర్ ఉన్న కేసు వచ్చినప్పుడు చట్ట ప్రకారం పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ దమ్మపేట పోలీసులు మాత్రం నిబంధనలను గాలికి వదిలివేశారన్నారు. ఘటనా స్థలంలో ఏదైనా గొడవ జరిగితే, అక్కడ ఉన్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం పోలీసుల విధి. కానీ, అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండానే కేవలం కొందరి ఫిర్యాదు ఆధారంగా, కనీస విచారణ కూడా చేయకుండా స్థానిక న్యాయవాది భవాని కృష్ణ యాద్ప ఉద్దేశ పూర్వకంగా అక్రమ కేసు పెట్టి వేధించడం అత్యంత శోచనీయమన్నారు. న్యాయవాదిపై పెట్టిన అక్రమ కేసును దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తెలిపారు.

పోలీసుల తీరుకు నిరసనగానే రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, న్యాయవాది గోళ్ల భవాని కృష్ణ యాద్ప పెట్టిన కేసును ఛార్జ్ షీట్ వేయకముందే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళి మోహన్, జనరల్ సెక్రెటరీ లక్కినేని నరేంద్ర బాబు, వైస్ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాదులు ముప్పిడి శ్యామ్ సుధాకర్, ఉడతనేని శ్రీనివాసరావు, మారం సతీష్ కుమార్, కాలం సంధ్యారాణి, తామ బాలరాజు, నల్లపు ఉదయ్ కుమార్, గద్దల అప్పారావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.