10 July, 2026 | 3:54 AM

నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం

10-07-2026 02:29 AM
  1. ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
  2. నారాయణఖేడ్లో ఏటీసీ సెంటర్‌కు భూమిపూజ
  3. మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ 

సంగారెడ్డి, జూలై 9 (విజయక్రాంతి)/ నా రాయణఖేడ్/ కంగ్టి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు పరిశ్రమ ల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్‌ఐ వైద్య సేవలను విస్తరిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపా ధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిం హ తెలిపారు.

గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్తో కలిసి  మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

త్వరలో ఆర్సీ పురం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 20 పడకల డయాలసిస్ యూనిట్ను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఏడాదిలో కార్డియాలజి సెంటర్ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శంషాబాద్, రామగుండం, మహబూబ్నగర్ ప్రాంతాల్లో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

రూ.200 కోట్లతో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి.. మంత్రి రాజనర్సింహ్మ

జిల్లాలో ఇప్పటికే ఏడు ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉండగా, సంగారెడ్డిలో ఎనిమిదో డిస్పెన్సరీని ప్రారంభించడం సంతోషకరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఆందోల్, జోగిపేట ప్రాంతాల ప్రజలకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఈఎన్టీ, క్యాన్సర్ చికిత్స, ట్రామా కేర్, నేత్ర వైద్య సేవలు వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతూ వైద్య సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, ఈఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. గౌతమ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు వనిత సంతోష్, అంజమ్మ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఈఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్  డా. గౌతమ్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఖేడ్ లో ఏటిసి సెంటర్ నిర్మాణానికి భూమి పూజ..

ఏటిసి సెంటర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు యువతకు అందుతాయని  తెలంగాణ రాష్ట్ర ఉపాధి కల్పన, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం నారాయణఖేడ్ లో ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ) సెంటర్ నిర్మాణానికి సంబంధించి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్, స్థానిక ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డితో కలిసి భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో నాలుగువేల కోట్లతో 119 ఏటీసీ సెంటర్ల ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 65 సెంటర్లు ప్రారంభమయ్యాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం సేతు బందు ద్వారా ఏటీసీ సెంటర్లకు రూ.280 కోట్లు నిధులు రావడం జరుగుతుందన్నారు. అనంతరం కంగ్టి మండల కేంద్రంలో రూ.50 లక్షల నిధులతో గ్రంధాలయ భవననిర్మాణనికి శంకుస్థాపన చేశారు. కంగ్టి  మండలానికి  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, స్థానిక పిహెచ్సి ని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని, మండలానికి సిఎస్సి సెంటర్ ఏర్పాటుతో పాటు నాగూర్ (బి), తుర్కవడ్గం పాఠశాలలను పదవ తరగతి వరకు అప్డేట్ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహకు  విన్నవించారు. కార్యక్రమంలో  జిల్లా కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆయా శాఖల అధికారులు, నారాయణఖేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.