గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర
- నిబంధనల మేరకే ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ములుగు, జూలై 9 (విజయ క్రాంతి):గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని,16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో గురువారం ములుగులో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇటీవల ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పాలన, చట్టాలు, విధివిధానాలు, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ స్థిరమైన యాక్షన్ ప్లాన్ అమలు, ఆర్థిక నిర్వహణ, పారదర్శక పాలనపై సమగ్ర అవగాహన కల్పించేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ చట్టాలు, తమ అధికారాలు, బాధ్యతలు, విధులు, ఆర్థిక నిబంధనలు, పరిపాలనా విధానాలపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధి పనులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా చేపట్టాలని, గ్రామసభలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు.
16వ ఆర్థిక సంఘం నిధులు అమల్లోకి వస్తున్న తరుణంలో ప్రతి సర్పంచ్ నిధుల మార్గదర్శకాలు, వినియోగ విధానం, అనుమతించ బడిన పనులు, వ్యయ నియమాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు. గతంలో అవగాహన లోపంతో కొందరు సర్పంచులు నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. టైడ్ ఫండ్స్, అన్టైడ్ ఫండ్స్, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ వనరులకు వంటి ప్రతి నిధికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, ఆయా నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు చేయాలని సూచించారు.
గ్రామ పంచాయతీల స్వంత ఆదాయాన్ని పెంపొందించేం దుకు పన్నులు, ఫీజుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్థికంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని అన్నారు. జీపీ -సాప్ ద్వారా గ్రామ అవసరాలను గుర్తించి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, హరితహారం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ రహదారులు, మురుగు నీటి పారుదల, ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రతి పనిని నాణ్యతతో, పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీ తనంతో అమలు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ప్రత్యేక నిధులకు ప్రత్యేక విధానాలు ఉంటాయని, వాటిని గ్రామ పంచాయతీ నిధులతో కలిపి వినియోగించరాదని స్పష్టం చేశారు. ప్రతి నిధిని దాని ఉద్దేశానికి అనుగుణంగా మాత్రమే వినియోగిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేరువవుతాయని, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
అంతకు ముందు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, స్వచ్ భారత్ మిషన్ డైరెక్టర్ ములుగు జిల్లా ప్రత్యేక అధికారి సురేష్ బాబు సర్పంచులకు శిక్షణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,వైస్ చైర్మన్ సారంగం డిపిఓ వెంకయ్య, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, ఎంపిడిఓ లు, ఎంపిఓ లు, గ్రామా ల సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు.






