10 July, 2026 | 3:07 AM

ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే రాజకీయ మైత్రి

10-07-2026 01:45 AM
  1. పేదలకు పట్టాలిచ్చి ప్రజాపాలనగా నిరూపించుకోండి
  2. ప్రభుత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి హితవు
  3. గుండ్ల సింగారం సందర్శించిన పల్లా, తక్కళ్ళపల్లి, ఎమ్మెల్సీ నెల్లికంటి

హనుమకొండ (మహబూబాబాద్) జులై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాసమస్యలు పరిష్కరిస్తేనే కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల రాజకీయ మైత్రి కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరిధిలోని గుండ్ల సింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో ఇండ్ల కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పల్లా వెంకట్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో కూల్చివేయబడిన సురవరం సుధాకర్ రెడ్డి భవన్ తో పాటు పేదల గుడిసెలను పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా ప్రజల మనసుల్లో నిలిచి పోవాలంటే పేదల గురించి ఆలోచించాలని సూచించారు.

పేదలకు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే వారి గూడును కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఐదేళ్ల క్రితం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గుడిసెలు వేసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూల్చి వేయడమేమిటని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షమే వై వహిస్తారని, కాంగ్రెస్ మితృత్వం కొనసాగాలంటే పేదల సమస్యలు పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు.

కమ్యూనిస్టులు పోరాటం చేస్తే మేం అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల తరుపున తాము చేస్తున్న పోరాటంలో పట్టాలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. గుండ్ల సింగారంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇచ్చి తమది ప్రజాపాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, నల్లు సుధాకర్ రెడ్డి, వలి ఉల్లా ఖాద్రీ, మండల కార్యదర్శి ఎన్ అశోక్ స్టాలిన్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వుట్కూరి రాములు, కర్రె  లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, బాషబోయిన సంతోష్,

కొట్టేపాక రవి, జిల్లా నాయకులు రాజ్ కుమార్, మాలోత్ శంకర్ నాయక్, గుంటీ రాజేందర్, అలువాల రాజు, పూజారి అమృతయ్య, కోడెపాక బాబు, మామునూరి దామోదర్, పూజారి నరేందర్, కేతపాక ప్రసాద్, తాటికొండ ప్రశాంత్, మాలోత్ మంగ, నలువాల సంధ్య, తాటికంటి మమత, గుంటీ రజిత, గిన్నారపు రోహిత్, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భూపోరాట కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.