102 మంది జీవిత ఖైదీలకు మోక్షం!
ముందస్తు విడుదలపై సుదీర్ఘ చర్చ
కుషాయిగూడ, మార్చి 14 (విజయక్రాంతి): సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏటా మూడుసార్లు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్న ఆదేశాల మేరకు తెలంగాణ హోంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి.వి. ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లా శాఖ కార్యదర్శి బి. పాపి రెడ్డి, తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా పాల్గొన్నారు.
రాష్ట్రంలోని జీవిత ఖైదీల ముందస్తు విడుదల అంశంపై విస్తృతంగా చర్చించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేసులను పరిశీలించి మొత్తం 102 మంది జీవిత ఖైదీలు ముందస్తు విడుదలకు అర్హులని కమిటీ గుర్తించింది. వీరిలో 96 మంది పురుషులు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ అంశంపై త్వరలో రాష్ట్ర కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత విడుదల ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో 213 మంది జీవిత ఖైదీలను ముం దస్తుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఆరు నెలల కాలం క్రితం తెలంగాణ జైళ్ల శాఖ నుండి సుమారు 92 మంది ఖైదీల విడుదల జాబితా లిస్టును తెలంగాణ హోంశాఖకు పంపించారు. తెలంగాణ హోం శాఖలో ఖైదీల విడుదల జాబితా లిస్ట్ పెం డింగ్ లో ఉంది. సమావేశంలో జైళ్ల శాఖ ఐజీలు ఎర్రంశెట్టి రాజేష్, మురళీ బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాసరావు, చంచల్గూడ సెంట్రల్ జైలు పర్యవేక్షణ అధికారి నవాబ్ శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.




