ఆర్టీసీలో భయం భయం
కొత్త కొలువులకు హాల్ట్
- పుష్కరకాలంలో తగ్గిన ఉద్యోగులు, కార్మికులు 18 వేల మంది
- అయినా ఒక్కసారికూడా జరగని రిక్రూట్‌మెంట్
- ఈవీ బస్సుల రాకతో.. ఉద్యోగుల భర్తీ అధికారం కార్పొరేట్ సంస్థలకే
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): ప్రజారవాణాకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ ఉన్న ఆర్టీసీ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ సంస్థ రోజురోజుకూ కునారిల్లుతోంది. ఒక్క బస్సు కొత్తగా వస్తే, ఐదుగురికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని గతంలో ఆర్టీసీపై నమ్మకం ఉండేది.
కానీ ఇప్పుడు ఒక కొత్త ఈవీ బస్సు వస్తే, సంస్థలో పనిచేస్తు న్న ఐదుగురు ఉద్యోగులు, కార్మికుల కొలువులుపోయే రోజులు దాపురించాయని ఆర్టీసీ కార్మిక సంఘాలు లబోదిబో మంటున్నాయి. ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా తీసుకుంటున్న చర్యలు, కార్పొరేట్ సంస్థలకు ఎర్ర తివాచీలు పరిచిమరీ వ్యాపార అవకాశాలను కల్పించడంతో.. ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక శక్తి రోజురోజుకూ సన్నగిల్లుతోంది.
అప్పట్లో ఘనత..
తెలంగాణ ఆర్టీసీ సంస్థ అంటే రాష్ట్ర ప్రజలకే కాదు.. చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలకుకూడా ఎనలేని నమ్మకం, భరోసా ఉండే ప్రజా రవాణా వ్యవస్థ. రాష్ట్రం మొత్తంపై 106 బస్సు డిపోలు, 3 వర్క్‌షాప్‌లు, బస్ భవన్, తార్నాక ఆసుపత్రి, మూడు ఈడీ ఆఫీసులతో కళకళలాడుతూ కనపడేది. మొత్తం బస్సులు 10 వేలకుపైగానే ఉండేవి. ప్రతిరోజూ సుమారు కోటి మందికిపైగా ప్రజ లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు.
ఇదంతా ఒకప్పటి మాట. అన్నింటికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది.. ఆర్టీసీలోకి ఒక కొత్త బస్సు తీసుకొస్తే ఐదుగురికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చినట్టుగా ఘనంగా చెప్పుకునేవారు. రాష్ట్రంలో అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థలుగా ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్తు సంస్థలు పోటాపోటీగా ఉండేవి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలుకూడా ఇదే విషయాన్ని చెప్పుకుం టూ, ఆర్టీసీ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నట్టుగా ఘనంగా ప్రకటించేవి.
పుష్కర కాలంలో..
ఆర్టీసీ ఇప్పుడు ప్రాభవం కోల్పోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వమేనని కార్మిక సంఘాలు బలంగా చెబుతున్నాయి. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ కూడా తెలంగాణ, ఏపీగా విడిపోయింది. అప్పుడు తెలంగాణ ఆర్టీసీలో మొత్తం సు మారు 58 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఉండేవారు.
ఇందులో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు, అధికారులు, ఇంజనీర్లు.. ఇలా అందరూ అన్ని విభాగాల్లోనూ ఉండేవారు. అయితే 2026 వచ్చేసరికి ఈ ఉద్యో గులు, కార్మికుల సంఖ్య 40 వేలకు పడిపోవడం గమనార్హం. అంటే పుష్కర కాలంలో మొత్తం 18 వేల మంది వరకు ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోయింది.
తగ్గిపోవడం ఖాయం..
ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 500 ఈవీ బస్సులు నడుస్తున్నాయి. ఇవి ఎక్కువగా హైదరాబాద్ నగరంతోపాటు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎంపిక చేసిన డిపోల్లో ఈవీ బస్సులను నడిపిస్తున్నారు. మరికొద్ది నెలల్లో మరో 2 వేల ఈవీ బస్సులు విడతల వారీగా రానున్నాయి. రాష్ట్రంలో ఉన్న 6 రీజియన్లలో ఒక్కో డిపో చొప్పున ఈవీ బస్సుల ను కేటాయించారు.
ఈవీ బస్సులను ప్రవేశపెట్టిన డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగుల, కార్మి కులు, సిబ్బందిని ఇతర డిపోల్లోకి బలవంతంగా అడ్జస్ట్ చేశారు. యధాప్రకారం కార్పొ రేట్ సంస్థలు నియమించుకున్న సిబ్బంది, ఉద్యోగులతో ఈవీ బస్సులను నడిపిస్తున్నారు. అంటే.. భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఈవీ బస్సులను బట్టి.. ఆర్టీసీ సిబ్బందిని ఇతర డిపోల్లోకి అడ్జస్ట్ చేయడం ఖాయంగా కనపడుతోంది.
హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 16 డిపోలు ఉన్నాయి. ఇందులో సుమారు 13 నుంచి 15 వేల మంది ఉద్యోగులు, కార్మికు లు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త ఈవీ బస్సులను ఎక్కువగా సిటీ పరిధిలోనే తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. అంటే.. సిటీ పరిధిలో ఉండే కార్మికులు, ఉద్యోగులే మొదటగా ప్రభావితం అవుతారని కార్మిక సంఘాలు అంటున్నాయి.
సిటీలో మొత్తం ఈవీ బస్సులను ప్రవేశపెడితే.. సిటీ పరిధిలో ఉన్న డిపోల్లోని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులందరినీ.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో అడ్జస్ట్ చేయకతప్పని పరిస్థితే కనపడుతోంది. అంటే.. కొత్త బస్సులతో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పక్కనపెడితే.. ఉన్న ఉద్యోగులు, కార్మికులకు ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రమాదం పొంచి ఉందని కార్మిక వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.
రిక్రూట్‌మెంట్ ఎక్కడ..
గడిచిన 12 ఏండ్లుగా ఎలాంటి రిక్రూట్‌మెంట్ లేదని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఏదో నామమాత్రంగా తాజాగా 3 వేలకుపైగా ఉద్యోగులు, కార్మికుల కోసం ఒక భర్తీ ప్రక్రియను చేపట్టారు. వాస్తవానికి ఒక కొత్త బస్సు వస్తే ఐదుగురికి కొత్తగా ఉపాధి లభిస్తుందనేది ఆర్టీసీలో కీలకమైన సూత్రం. కానీ కొత్త బస్సులు వస్తున్నా.. ఈ సూత్రం పనిచేయడం లేదు. ఎందుకంటే.. డ్రైవర్‌కే కండక్టర్ బాధ్యతలను (టికెట్ ఇచ్చే యంత్రాలతో) అప్పజెప్పుతున్నారు. అలాగే డిపోల్లో పనిచేసే ఉద్యోగులు, టెక్నీషీయన్లు, శ్రామిక్‌ల సంఖ్యకూడా యేటికేడు తగ్గుతోంది. రిటైర్మెంట్ అవుతున్నారు. కానీ అ స్థాయితో కొత్తగా ఉద్యోగులు, కార్మికులను భర్తీ చేయడం లేదు.
ఈవీ బస్సుల రాకతో..
నిజానికి కాలుష్యం కారకమైన సంప్రదాయ ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సుల స్థానంలో కాలుష్యం రహిత, కర్బన ఉద్గారాల రహితమైన ఈవీ బస్సులను తీసుకురావాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కోరుకుంటున్నారు. అయితే ఈవీ బస్సు లను కొత్తగా ఆర్టీసీలోకి చేర్చడంతో తమ ఉద్యోగ భద్రత ప్రమాదం పడకూడదంటూ వారు కోరుతున్నారు. డిమాండ్ చేస్తున్నారు. అయితే కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఇం దుకు భిన్నంగా కనపడుతోంది.
ఈవీ బస్సులను తయారుచేయడానికి ప లు కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభు త్వం గ్రాంట్ ఇస్తోంది. ఈ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌పై తీసుకుంటోంది. అయితే ఈ ఈవీ బస్సులను పూర్తిగా ఆర్టీసీకి ఇవ్వకుండా.. కేవలం అద్దెకు మాత్రం కార్పొరేట్ సంస్థలు ఇస్తున్నాయి.
పైగా ఈవీ బస్సులకు కావాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, నిపుణులు, సూపర్‌వైజర్లు, అధికారులనుకూడా కార్పొరేట్ సం స్థలే ఔట్‌సోర్సింగ్ చేసుకుంటున్నా యి. కేవలం మహాలక్ష్మి పథకం అమ లు అవుతున్న బస్సుల్లో మాత్రమే ఆర్టీసీ కండక్టర్లను ఉపయోగించుకుంటున్నారు. మిగతా డ్రైవర్లు, టెక్నీషి యన్లు, సూపర్‌వైజర్లను కార్పొరేట్ సంస్థలే నియమించుకోవడంతో.. ఉ ద్యోగాల సంఖ్య పెరగడం లేదు. పైపె చ్చు ఆర్టీసీ ఉద్యోగులనుకూడా ఉపయోగించుకోవడం లేదు.
ఈవీ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలి..
కార్పొరేట్ సంస్థలకే ఈవీ బస్సులను ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి. ఈవీ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం మానివేసి.. మొత్తంగా ఇవ్వాలి. అవసరం అయితే ప్రభుత్వం ఈవీ బస్సులను కొనుగోలుచేసి.. ఆర్టీసీకి ఇస్తే, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు వాటిని నడిపిస్తారు.. నిర్వహిస్తారు. ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిన ప్రభుత్వం.. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతుంది. ఈవీ బస్సులను తయారుచేసిన కార్పొరేట్ సంస్థలే ఔట్‌సోర్సింగ్ చేసుకున్న సిబ్బందితో వాటిని నడిపిస్తున్నాయి.
అద్దెను ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇదెక్కడి వ్యవస్థ. ఆర్టీసీపై పగబట్టిన ప్రభుత్వం.. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా వ్యవహరిస్తోంది. అవసరమైతే ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఈవీ బస్సులపై శిక్షణ ఇచ్చి.. బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేస్తేగానీ.. ఆర్టీసీ అనే వ్యవస్థ బతకదు. లేకపోతే ఆర్టీసీ కనుమరుగు కావడం ఖాయం.
ఎ రాంచంద్రారెడ్డి (ఏఆర్ రెడ్డి),
టీఎంయూ ప్రెసిడెంట్




