4 July, 2026 | 3:27 AM

భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే

04-07-2026 02:23 AM

ల్యాండ్ సర్వే ఏ డీ ఏ సి.హెచ్ శ్రీనివాసులు

మహబూబాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఎంతో కాలంగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమం చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే (భూ భారతి) ప్రక్రియపై జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో అధికారులు ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సులు (గ్రామసభలు) నిర్వహిస్తున్నారని, జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు తెలిపారు.

దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా లోని వివిధ మండలాలలో  భూ భారతి - భూముల రీ సర్వేపై అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాలో 70 గ్రామాల్లో  భూముల రీ సర్వే జరుపుటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, రీ సర్వే పై అవగాహన కల్పించుటకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రీ సర్వే ద్వారా ప్రతి రైతుకు సర్వే నెంబర్ నమోదుచేసి, భూమి కమతాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తామని, గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే రీ సర్వేలో సరిచేసుకోవచ్చని ఎలాంటి వివాదాలు లేకుండా చేసి భూమికి భూధార్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సర్వే నిర్వహించే తేదీల్లో రైతులు అందుబాటులో ఉండి ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీ సర్వే ద్వారా గ్రామ, భూ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, రహదారులతో పాటు ఇతర ప్రజా అవసరాల భూములను కచ్చితంగా రీ సర్వే చేయనున్నట్లు తెలిపారు. రీ సర్వే కార్యక్రమం ప్రజలకు మెరుగైన భూ హక్కులను కల్పించేందుకు ఉద్దేశించిందని  ప్రజల సహకారం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.