4 July, 2026 | 3:27 AM

అక్రమాలపై విచారణ జరపాలి

04-07-2026 02:24 AM

ఘట్‌కేసర్ ఎమ్మార్వోకు పాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి

ఘట్కేసర్, జూలై 3 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, మాదారం లోని సర్వే నెం.195లో ఉన్న క్రైస్తవుల సమాధుల స్థలంలో నూతన కమిటీ పేరుతో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని ఘట్ కేసర్ పాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఘట్ కేసర్ తహసిల్దార్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వం ఈ సమాధుల స్థలాన్ని పాస్టర్ చర్చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు అప్పగించినప్పటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, సంస్థతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులతో నూతన కమిటీని ఏర్పాటు చేసి, ప్రజలపై అనవసర ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా, ప్రభుత్వ స్థలానికి నిర్మాణదాతలుగా ప్రైవేటు వ్యక్తుల పేర్లు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆ బోర్డులను వెంటనే తొలగించాలన్నారు. భూస్థాపన కోసం కుటుంబాల నుంచి బలవంతంగా రూ.10,000 వసూలు చేయడం జరుగుతోందని, ఈ అంశంపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు.