రెయిన్ బో స్కూల్ బరితెగింపు
విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం
అమీన్ పూర్: ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటించకుండా ఫీజులను అదిగమించి విద్యార్థులపై భారం మోపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్ మీద ఒక్కొక్కరికి రూ. 20 వేలకు పెంచడం దారుణమని మండిపడుతున్నారు. ఫీజులు తగ్గించకుంటే తమ పిల్లల టీసీలు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని రెయిన్ బో ఇంటర్నేషనల్ స్కూల్ లో బుక్స్ పేరిట, ఆన్వల్ డే పేరిట పెంచిన ఫీజులను నిరసిస్తూ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఎర్రటి ఎండలో ధర్నాకు దిగారు.
ప్రతి ఏటా ట్యూషన్ ఫీజులు పది శాతం పెంచడంతో పాటు నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, ఆన్వల్ డే అంటూ వేల రూపాయల ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఒకరి పుస్తకాలను ఒకరు వాడరాదంటూ మళ్లీ కొత్తవే కొనాలని పట్టుబట్టడంతో ఒక్కొక్కరికి రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని, బంగారం ధరలకంటే ఎక్కువగా బుక్స్ ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వారం రోజులుగా ఈ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం స్పందించకుండా తమ డిమాండ్లను నిరాకరిస్తుందన్నారు. ఎక్స్ ట్రా యాక్టివిటీల పేరుతో డబ్బులు దండుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫీజులను తగ్గించే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్ తేల్చి చెప్పడంతో తమ పిల్లల టీసీలను ఇచ్చేయాలని తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు.




