ఇది కేసీఆర్ చేసిన పాపం!
- ప్రతి రైతు కాళ్లు మొక్కినా పాపానికి ప్రాయశ్చితం లేదు
- లక్షా ఇరవై వేల కోట్లను గోదావరిలో కలిపిసిన కల్వకుంట్ల కుటుంబం
- కన్నెపల్లి టూర్ పేరుతో కేటీఆర్ సరికొత్త కుట్ర
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) జూలై 5 (విజయక్రాంతి): ‘80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ తానే గొప్ప ఇంజనీర్‌గా ఊహించుకున్ని కాళేశ్వరం కట్టాడు. కూలేశ్వరం కాస్తా కూలేశ్వరం అయింది. ఇది కేసీఆర్ చేసిన పాపం. తెలంగాణలోని ప్రతి రైతు కాళ్లు మొక్కినా కేసీఆర్ పాపానికి ప్రాయశ్చితం లేదు’ అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన కల్వకుంట్ల కుటుంబం మళ్లీ కుట్రలు మొదలు పెట్టిందని, కన్నెపల్లి టూర్ పేరుతో కేటీఆర్ సరికొత్త కుతంత్రానికి బయలుదేరాడని విమర్శించారు. మొత్తం ప్రాజెక్టును గోదావరి పాలు చేయడానికి బ్యాచ్ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. ‘లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలను గోదావరిలో కలిపిసిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు సరికొత్త కుట్రలకు తెరలేపుతోంది. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ తానే గొప్ప ఇంజనీర్ గా ఊహించుకున్ని కాళేశ్వరం కట్టాడు. కూలేశ్వరం కాస్తా కూలేశ్వరం అయింది. మేడిగడ్డ కుప్పకూలింది. సుందీళ్లలో సీపేజ్ వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను కుప్ప కూల్చి ఆ కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వంపైకి తోయడమే వీళ్ల ఉద్దేశం.
నీళ్లు ఆపితే మేడిగడ్డ బ్యారేజ్, దాని కింద ఉన్న బ్యారేజీలు కొట్టుకుపోవాలన్నదే కేసీఆర్, కేటీఆర్ కుట్ర. కింద ఉన్న ములుగు, భద్రాచలంతో పాటు మిగిలిన ప్రాంతాలు కొట్టుకుపోయి జనాల ప్రాణాలు పోవాలన్నదే వీళ్ల ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి రాజకీయంగా బతకాలని కేసీఆర్, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు.
డిజైన్ లోపాల వల్లే ఈ పరిస్థితి
అన్నారం, సుందీళ్లలో వియరింగ్ కోట్, కాంక్రీట్ బ్లాకులు తెగడంతో లీకేజీ, పైపింగ్ వంటి లోపాలున్నాయని ఎన్ డీఎస్ ఏ తేల్చిచెప్పింది. గతంలో సరస్వతీ (అన్నారం పంప్ హౌస్ లో 12 మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి. మోటార్లు అన్ని వరద నీటిలో తేలాయి. డిజైన్ లోపాల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఇంజనీర్లు చెప్పారు. ఈ డిజైన్ల వెనుక పెద్ద ఇంజనీర్ కేసీఆర్ ఉన్నాడు. ఆయనకు భజన చేసిన హరీశ్‌రావు, కేటీఆర్ ఉన్నారు’ అని విమర్శించారు.
మేడిగడ్డ వద్ద నీళ్లు నిల్వచేయకపోయినా పంప్ లు ఆన్ చేయోచ్చునని కబుర్లు చెపుతున్నారని, ఇక్కడ నీళ్లు ఎత్తిపోవడానికి పాండ్ లెవల్ ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసినా కుల్వకుంట్ల కుటుంబం రైతులను రెచ్చగొట్టడానికి మాట్లాడుతోందన్నారు. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలని, ఎలా ఆన్ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా రాష్ట్రంలో రైతులు సమృద్ధిగా పంటలు పండించారని, దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని చెప్పారు. రైతులను డైవర్ట్ చేయడానికి, కూలిపోయిన కాళేశ్వరం గొప్పలు చెప్పుకోవడానికి కేటీఆర్ టీం కన్నెపల్లి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
అనుకున్న చోట కాకుండా అన్నారం స్థలాన్ని 2.2 కిలో మీటర్ల దూరంలో, సుందిళ్ల స్థలాన్ని 5.4 కిలోమీటర్ల దూరంలో కట్టారని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఆపొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని, మేడిగడ్డ లో నీళ్లు ఆపితే ఒత్తిడికి లోనైనా బ్యారేజ్ కొట్టుకుపోయే అవకాశం ముందని ఎన్ డీఎస్ ఏ తేల్చి చెప్పిందని వివరించారు. నీళ్లు ఎత్తిపోయాలని కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఎత్తిపోసిన నీళ్లు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు.
కాళేశ్వరంలో రిపేర్లు మొదలయ్యాయని చెప్పారు. భూగర్భ సాంకేతిక పరీక్షలు, నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టులు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, డ్రోన్ సర్వేలతో పాటు వందలాది బోర్ హోల్స్ వేస్తున్నామన్నారు. 2028 నాటికి కాళేశ్వరం రిపేర్లు పూర్తి చేసి అందుబాటులోకి తెవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.






