6 July, 2026 | 3:53 AM

కాంగ్రెస్ అండతోనే ఒవైసీ బరితెగింపు

06-07-2026 02:49 AM

హైకోర్టునే బెదిరిస్తున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్

మీ విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్?

బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా విద్యాసంస్థను కూల్చేస్తాం

ఎంఐఎంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ అండతోనే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బరితెగిస్తున్నాడని, హైకోర్టునే బెదిరించేలా ఆయన మాట్లాడు తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదని, ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదు? అని ఫైర్ అయ్యారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా సంస్థలను కూల్చివేస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరు ద్దీన్ ఒవైసీ హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారని, చెరువును ఆక్రమించుకుని విద్యా సంస్థలను నిర్మించడమే తప్పు అని తెలిపారు. గండిపేటలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలను కూల్చేస్తామంటూ నోటీసుల మీద నోటీసులిస్తున్నారని, మరీ ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు ఇంకో న్యాయమా అని నిలదీశారు. ఒవైసీ విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చింది నిజం కాదా? విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా సంస్థలను కూల్చివేస్తామని, అక్రమార్కులకు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని -ఎంఐఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.