పుతిన్ భారత్ పర్యటన ఖరారు
- ఒక్క ఏడాదిలోనే రెండోసారి పర్యటన
- గతేడాది డిసెంబర్‌లో ఇరు దేశాల వార్షిక సదస్సుకు హాజరు
- మళ్లీ సెప్టెంబర్‌లో జరగనున్న ‘బ్రిక్స్’ సదస్సుకు పుతిన్
మాస్కో, మే ౧౯: భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ ౧౨, ౧౩వ తేదీల్లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన ఖరారైంది. ఈ మేరకు మాస్కో నుంచి మంగళవారం ప్రకటన విడులైంది. ఆ దేశపు క్రెమ్లిన్ ప్రతినిధి రి ఉషాకోవ్ పర్యటనను ధ్రువీకరించారు. భారత్, రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒకే ఏడాది కాలంలో పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. పుతిన్ గతంలో 2025 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన 23వ భారత్-- రష్యా వార్షిక సదస్సు కోసం దిల్లీకి వచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం అదే మొదటిసారి. 2024 వరకు బ్రిక్స్ సభ్య దేశాలుగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ఆఫ్రికా ఉండేవి. ఆ తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ దేశాలు చేరాయి. 2025 లో ఇండోనేషియా కూడా భాగస్వామి అయింది. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా కలిగిన ఈ కూటమి నిర్వహించే సదస్సు అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఆకర్షించనున్నది.






