29 June, 2026 | 2:02 AM

ప్రైవేట్ పాఠశాలలకు రక్షణ కల్పించాలి

29-06-2026 01:09 AM
  1. డీజీపీకి ట్రస్మా ప్రతినిధి బృందం విజ్ఞప్తి
  2. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి

ముషీరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలకు అన్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, కుల సంఘాలు, ఇతర బాహ్య సంస్థల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిజిపి సీవి ఆనంద్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎన్.రెడ్డి, కోశాధికారి కె. శ్రీకాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు బి.రాఘవ, లీగల్ సెల్ మెంబర్ సీహెచ్.శివకుమార్ ఆదివారం  మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 11,500 బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రస్మా, రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులకు సరసమైన ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. అయితే సామాజిక కార్యకర్తలు, జాయింట్ యాక్షన్ కమిటీలు (జేఏసీలు), కొందరు విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ కార్యకర్తలు,  పాత్రికేయులుగా చెప్పుకునే వ్యక్తులు పాఠశాలల్లోకి వచ్చి ఆటంకాలు సృష్టించడం,

బెదిరింపులు, ద్రవ్య దోపిడీ ప్రయత్నాలు, ఉచిత విద్య డిమాండ్లు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది భద్రతకు ముప్పుగా మారుతున్నాయని, పాఠశాలలపై దాడులు జరిగితే బ్యాంకులు, ఆస్పత్రులపై దాడుల మాదిరిగానే కఠిన చర్యలు తీసుకోవాలని ట్రస్మా ప్రతినిధులు డీజీపీని కోరారు. దీనిపై డీజీపీ ఆనంద్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.