29 June, 2026 | 3:16 AM

ఒట్టేస్తున్నా.. మూసీ ప్రక్షాళన చేస్తా

29-06-2026 02:00 AM

ఎవరు అడ్డుకున్నా పండబెట్టి తొక్కుతాం

  1.  బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్బీసీని పడావుబెట్టింది 
  2. మేము ఎస్‌ఎల్బీసీని పూర్తిచేసి నీళ్లిస్తాం 
  3. అవినీతి అంటూ బిల్లారంగాల ఆరోపణలు 
  4. అభివృద్ధిపైన అసెంబ్లీలో చర్చకు సిద్ధం 
  5. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  6. నల్లగొండలో హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన.. కనగల్‌లో పైలాన్ ఆవిష్కరణ

నల్లగొండ, జూన్ 28 (విజయక్రాంతి): మూసీ కాలుష్యం కర్కశంగా మారిందని అందుకే ఒట్టేసి చెప్తున్నా.. దేశానికే తలమానికంగా మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని, ఎవరు అడ్డం వచ్చి నా పండబెట్టి తొక్కుకుంటూ ముందుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, బీఆర్‌ఎస్ పాలిం చి ఎస్‌ఎల్బీసీని పడావుబెట్టిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల లోపు ఎస్‌ఎల్బీ సీని పూర్తి చేసి, నల్లగొండకు సాగునీరు పారిస్తామని చెప్పారు.

ఇంకా సింగరేణి టెండరే కాలే.. అప్పుడే అవినీతి అంటూ బిల్లారంగాల ఆరోపణలు చేస్తున్నారని, మూసీ కంపుకంటే వీళ్ల కడుపు కంపు ఎక్కువైందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  అభివృద్ధి పైన అసెంబ్లీలో చర్చకు సిద్ధమని అన్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రూ. 13006 కోట్లతో 6,092కిమీ, 441 రహదారుల పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నల్లగొండ జిల్లాలోని కనగల్ మండల కేంద్రంలో శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎన్జీ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంగా, యమునా ప్రక్షాళన కంటే మూసీ ప్రక్షాళన దేశానికి ఆదర్శంగా ఉండేలా చేసి తీరుతామని స్పష్టంచేశారు. 30 నెలల పాలనలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యో గుల ఆత్మ గౌరవం నిలబెట్టామన్నారు. పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం  కేసీఆర్ ది అన్నారు. పాలనా కాలమంతా ఎస్‌ఎల్బీసీని పడావు పెట్టిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీది చెప్పారు.

వచ్చే ఎన్నికల్లోపు ఎస్‌ఎల్బీసిని పూర్తి చేసి నల్లగొండ నేలల్లో సాగునీరు పారిస్తామన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.8లక్షల 11 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని వెల్లడించారు. రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులు అయ్యారని, కొండ లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి తెలంగాణ కోసం నిహార దీక్షలు చేశారని గుర్తు చేశారు.

వంద రూపాయలు పెట్రోల్ తెచ్చుకున్న, రూపాయి అగ్గిపెట్టె దొరకని అగ్గి పెట్టిరావు చేసిన త్యాగం ఏమీ లేదని కేటీఆర్, హరీశ్‌రావుల గురించి వ్యంగ్యాస్త్రాలు సందించారు. ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని వాటిని అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదన్నారు. ఇప్పటికే వీరిని సామాజిక బహిష్కర ణ చేసిందన్నారు. మూసీ కంపు కంటే వీళ్ల కడుపు కంపు ఎక్కువైందన్నారు.                

చర్చకు సిద్ధమని సవాల్

12 ఏళ్ల బీజేపీ పాలన, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలన్నారు. ఎవరు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించారో చర్చకు రచ్చబండలోనైనా, అసెంబ్లీలోనైనా ఎక్కడైనా సిద్ధమని సవాల్ విసిరారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పాఠశాలల ఆధునికీకరణ చేసి వందల మందిని అంబేద్కర్లను తయారుచేయా లనే లక్ష్యంతో ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు.

కాలేశ్వరం.. కూలేశ్వరం ఐయిందని, హరీశ్‌రావు.. కాలేశ్వరరా వుగా మారాడని.. వారి పాలన అంతా కుటుంబ దోపిడీ.. భవంతులు ఫాం హౌజ్‌ల నిర్మాణం పైనే ఉందన్నారు. ప్రజా పాలన పోవాలంట..పాపాల భైరవుని పాలన రావాలని బిల్లా రంగాలు తిరుగుతున్నారని అన్నా రు. వారి పాలనను ప్రజలు ఎందుకు కోరుకుంటారో చెప్పాలన్నారు. 

మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలకు గుర్తు లేవనుకుంటున్నారా అని కేటీఆర్, హరీశ్‌రావును నిలదీ శారు. సింగరేణిలో టెండరే జరగలేదు అవినీతి అంటూ బిల్లా, రంగాలు బయటికి వచ్చి తెగ మొత్తుకుంటున్నారని విమర్శించారు. ఆ కుటుంబం ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడదని, నోరు తెస్తే పచ్చి అబద్ధాలేనని అన్నా రు. నల్లగొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలలో తులసి వనంలో గంజాయి మొ క్కలా సూర్యాపేటలో ఒకరు ఉన్నారని తెలిపారు.

ఈసారి ఎన్నికల్లో ఆ గంజాయి మొక్కను తొలగించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు అని చెప్పా రు. ప్రజల అండదండలతో 2034 వరకు ఇక్కడ మూడు రంగుల జెండా ఎగురుతుందని, కచ్చితంగా ప్రజాపాలన సాగిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్పు లు బిర్లా ఐలయ్య, వేముల వీరేశం, ఎంపీలు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీరెడ్డి, మందుల సామెల్, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, ఉత్తం పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటే సత్యం, శంకర్ నాయ క్ నేతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస నేత, గుప్తా అమిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే హ్యామ్ రోడ్లు: మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి

హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రతిపాదన దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగోలులో దేశంలోనే ముందంజలో ఉన్నామని, రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ధా న్యం ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ రేషన్ కార్డు లు అందించి, సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఎస్‌ఎల్బీసీ సొరం గాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామన్నారు. బునాది గాని, బస్వాపూర్, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

మానవీయ కోణంలో పాలన: డిప్యూటీ సీఎం భట్టి 

రాష్ట్రంలో వివిధ పథకాల కింద 90 వేల కోట్లతో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి నాంది పలికామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు తలమానికగా మారుతుందన్నారు. జిల్లాలో తాను నక్కల గడి నుంచి పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. దశాబ్ద కాలం పాలించిన గత పాలకులు ఎస్‌ఎల్‌బీసీని, డిండిని పూర్తి చేయలేదన్నారు. గత పాలన అహంకారంగా సాగితే నేడు మానవీయ కోణంలో పాలన సాగుతోందన్నారు.

ప్రజా అవసరాలే మా ఎజెండాగా పనిచేస్తున్నామని, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వెల్లడించారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రజల అవసరాలే... వారి ఆకాంక్షల మేరకే ప్రజాపాలన సాగుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అదిగమిస్తూ ముందుకు పోతామని తెలిపారు.